జగమెరిగిన సత్యాన్ని వెల్లడించిన పాకిస్తాన్

రచన: కౌశిక్ రాయ్: ఎఐఆర్: విశ్లేషకులు
పాకిస్తాన్ ప్రకటన ఆసక్తిని రేపేలా ఉంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో 40 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయంటూ ప్రకటించారు. అంతేకాదు పాకిస్తాన్ అడ్డాగా 40 వేల మంది ఉగ్రవాదులున్నారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధాని అయిన తర్వాత తన తొలి అధికారిక వాషింగ్టన్ పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు నిలయంగా ఉందన్న సత్యాన్ని ఒప్పుకున్నారు. గతంలో ఇస్లామాబాద్ ప్రభుత్వాలేవీ కూడా ఈ సత్యాన్ని అమెరికాతో పంచుకోలేదని వ్యాఖ్యానిం చారు.

అమెరికా ఉగ్రవాదంపై చేస్తున్న పోరుతో పాకిస్తాన్ కూడా కలిసి పోరాడుతోందని ఖాన్ అన్నారు. ‘‘పాకిస్తాన్‌కు 9/11 ఉగ్రదాడులతో ఏ విధమైన సంబంధం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఆల్-ఖైదా ఉంది. పాకిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు ఎవ్వరూ లేరు. అయినా కూడా మేం అమెరికా చేస్తున్న ఉగ్రవాద పోరాటంతో చేతులు కలిపాం. దురదృష్టవశాత్తు పరిస్థితులు వికటించడంతో, నేను నా ప్రభుత్వాన్ని నిందించాను. మేం అసలు సత్యాలను అమెరికాకు వివరించలేదు’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ మహిళ షైలా జాక్సన్ లీ కాపిటల్ హిల్‌లో ఇచ్చిన విందు సందర్భంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. షైలా కంగ్రెషనల్ పాకిస్తాన్ కాకస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వాషింగ్టన్‌ డిసిలో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో జరిగిన మరో కార్యక్రమంలో ఖాన్ మాట్లాడుతూ ‘మా దేశంలో ఇప్పటికీ 30 వేల నుంచి 40 వేల మంది మిలిటెంట్లు ఉన్నారు. వీరంతా శిక్షణ పొందిన వారు. ఆఫ్ఘనిస్తాన్ లేదా కశ్మీర్‌లలో కొన్ని ప్రాంతాలలో చోటుచేసుకున్న పోరాటాలలో పాల్గొన్నారు’ అని పేర్కొన్నారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రకటనను భారత్ ‘గ్లేరింగ్ అడ్మిషన్’ (మెరుపు ఒప్పుకోలుగా) అభివర్ణించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నమ్మకం, విశ్వాసం కలిగించే చర్యలను వారిపై పాకిస్తాన్ చేపట్టాల్సిన సమయం ఇదేనని భారత్ వ్యాఖ్యానించింది. ‘నిజంగా ఇది పాకిస్తాన్ నాయకత్వం ‘మెరుపు ఒప్పుకోలు’ అని భారత విదేశాంగ వ్యవహారా శాఖ అభిప్రాయపడింది. వెంటనే ఉగ్రవాదులపై, సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది.

భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ ప్రకటనకు స్పందిస్తూ పాకిస్తాన్ ప్రధాని వేలమంది ఉగ్రవాదులు తమ భూమిపై ఉన్నారని అంగీకరించారంటూ వ్యాఖ్యానించారు. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కొన్ని దేశాల విధానంగా కనిపిస్తోంది. మన పొరుగు దేశంతో సహా’ అని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు సునిశితంగా విమర్శించారు.

వాషింగ్టన్‌లో మాట్లాడుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయం ప్రపంచానికి కూడా తెలుసంటూ వ్యాఖ్యానించారు. అయితే 40 వేల మంది ఉగ్రవాదులపై తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి మాత్రం ఇమ్రాన్ నోరు మెదపలేదు. ఇది పాకిస్తాన్ వ్యవహారశైలిలో మార్పు ఉండదని, గతంలో మాదిరే కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టంచేస్తోంది.

పాకిస్తాన్ ప్రధాని పేర్కొన్న ఉగ్రవాదుల సంఖ్య గ్లోబల్ ఉగ్రవాద నిధుల సహాయ ‘వాచ్‌డాగ్’ అయిన ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్)’కు సమర్పించిన సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ చెప్పిన యాక్షన్ ప్రణాళికను అనుసరించి సెప్టెంబరు నాటికి ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా చర్యలను నిబద్ధతగా అమలుచేయడంలో పాక్ వైఫల్యం చెందిన పక్షంలో అది ‘బ్లాక్‌లిస్టింగ్’ జాబితాలోకి చేరే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చట్టం షెడ్యూల్-4 లో నిషేధిత సంస్థల గురించి వివరాలు ఉన్నాయి. అందులో కేవలం ఎనిమిది వేల మంది మిలిటెంట్లు మాత్రమే పాకిస్తాన్ స్థావరంగా పనిచేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం తన జాబితాలో పేర్కొంది. 

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన ఎఫ్ఎటిఎఫ్ యాక్షన్ ప్లాన్‌కు సంబంధించి ఎంత శక్తివంతంగా వర్తిస్తుందన్నది చూడాలి. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్ లాంటి దేశాలు ఈ అంశాన్ని ఎఫ్ఎటిఎఫ్‌లో లేవనెత్తవచ్చు అని ఒక పాకిస్తాన్ విశ్లేషకుని అభిప్రాయం. ఉగ్రవాదం గురించి అలవోకగా మాట్లాడి వివాదాలు రేకెత్తించడం ఇమ్రాన్ ఖాన్‌కి ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా టెహ్రాన్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ రొహానీతో జరిగిన సమావేశంలో ఇరాన్ వ్యతిరేక ఉగ్రవాద బృందాలు పాకిస్తాన్ భూభాగం నుంచే పనిచేస్తున్నాయంటూ అనడంపై పాకిస్తాన్ పార్లమెంటులో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఒక్కోసారి వేడి వేడిగా, మరోవైపు చల్లగా వ్యవహరించే దౌత్య విధానాన్ని ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం పాకిస్తాన్ విషయంలో అనుసరిస్తోంది కానీ ఇది విజయవంతం కాలేదు. గత ఏడాది ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం పాకిస్తాన్‌కి అందించే 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన పౌర, సైనిక సహాయాన్ని రద్దు చేసింది. అమెరికా-పాక్ సంబంధాలు కూడా హఠాత్తుగా, నాటకీయంగా క్షీణించడం జరుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని ఇటీవల వాషింగ్టన్ పర్యటన సమయంలో అందుకు అనుగుణంగా అమెరికా తన మనసును వెంటనే మార్చుకుంది.

ఆఫ్ఘన్ తాలీబాన్‌తో ఇస్లామాబాద్ సంధి కుదుర్చుకునేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నించడాన్ని కూడా అమెరికా గమనిస్తోంది. ఆప్ఘన్ తాలిబాన్లను నియంత్రించేది పూర్తిగా పాకిస్తాన్ సైనిక వ్యవస్థ అనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్పష్టంగా తెలుసు. అమెరికా తాలిబాన్లతో సంభాషణలు జరుపుతోంది. ఈ సంభాషణలు కూడా పాకిస్తాన్ తోడ్పాటుతో జరుగుతున్నాయి. కాబూల్‌లో ప్రభావం తెచ్చే విధంగా కీలకంగా వ్యవహరించాలని ఇస్లామాబాద్ కోరుకుంటోంది. పాకిస్తాన్ గేమ్ ప్లాన్ ఏమిటంటే ఒకవైపు వాషింగ్టన్‌కు మిత్రుడిగా ఉన్నట్టు కనిపిస్తూనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని బయటకు పంపే ఆలోచనలు చేస్తోంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో కింగ్‌మేకర్ పాత్ర పోషించాలన్నది పాక్ ఆలోచన. అదే కనుక జరిగితే దక్షిణా ఆషియాకు మాత్రమే భద్రతాపరమైన సమస్యలు తలెత్తవు. పొరుగుదేశాలకు కూడా అంతే తీవ్రంగా ఆ సమస్యలు విస్తరిస్తాయి.

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన