శ్రీలంకలో పెట్టుబడులను పెంచుతున్న భారత్

భారత, శ్రీలంక దేశాలు 91.26 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువచేసే ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంననుసరించి మాహో నుంచి ఒమంథై వరకూ రైల్వే లైనును సముద్ధరించాని నిర్ణయించుకున్నాయి. మాహో నుంచి ఒమథై వరకూ మొత్తం 130 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రాక్ కవర్ చేస్తుంది. వంద సంవత్సరాల కాలంలో తొలిసారి ఈ రైలు మార్గాన్ని పునరుద్ధరించే పనిపై ఒప్పందం చోటుచేసుకోవడం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శ్రీలంక రైల్వేల మెరుగుదలలో భారత్ అందిస్తున్న తోడ్పాటు అందరికీ తెలిసిన విషయమే. ద్వీప దేశమైన శ్రీలంకలో ఇప్పటివరకూ శ్రీలంక రైల్వే రంగ అభివృద్ధికి మొత్తం 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయాన్ని భారత్ ప్రకటించడమే కాదు దానికి కట్టుబడి వ్యవహరిస్తోంది కూడా.

దీన్నిబట్టి స్పష్టమవుతన్న విషయం ఏమిటంటే భారత్ తన పెట్టుబడులను బాగా మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. అలాగే మూడవ ప్రపంచ దేశాలతో సంయుక్త పెట్టుబడులకు కూడా భారత్ సంసిద్ధంగా ఉంది. భారత్ చేపట్టిన ప్రాజక్టులు ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా చేపట్టినవి. అక్కడి ప్రజల ఆరోగ్యం, విద్య, అనుసంధానతా రంగాలపై భారత్ దృష్టి పెట్టింది. ఈ నెలలో వంద వరకూ మోడల్ విలేజీలను భారత సహాయంతో గమ్‌పహ జిల్లాలో నిర్మించారు. వాటి ప్రారంభోత్సవం కూడా జరిగింది. శ్రీలంకలో మొత్తం 2,400 మోడల్ గ్రామాల ఏర్పాటుకు భారత్ అంగీకరించింది. అందులో భాగమే తాజాగా ప్రారంభించిన మోడల్ గ్రామాలు. వీటికి తోడు యుద్ధం వల్ల దెబ్బతిన్న శ్రీలంక ఉత్తర, తూర్పు, మధ్య శ్రీలంక ప్రాంతాలలో 60 వేల గృహాలను కూడా భారత్ నిర్మిస్తోంది. మరో కార్యక్రమంలో భాగంగా శ్రీలంకలోని ప్రజలందరికీ విస్తృతస్థాయిలో అంబులెన్సు సర్వీసులను ఆ దేశానికి భారత్ అందించనుంది. భారత్ ఈ నిర్ణయాన్ని శ్రీలంక ప్రజలు ఎంతగానో కొనియాడారు. శ్రీలంకలో మోడల్ గ్రామాలను నిర్మించడంలో సహాయపడ్డం అనేది కేవలం తమిళులు అధికంగా ఉన్న ప్రాంతాలకే పరిమితం కాదు. దేశమంతా కూడా ఈ సేవలను అందించడం ద్వారా సహకారానికి అనుకూలంగా భారత్ సంసిద్ధంగా ఉందనే సత్సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సత్సంబంధాలు, సహకారం పెంపుదలకు పరస్పర విశ్వాసం చాలా అవసరం.

ఇవి భారత సహకార విధానంలో ఎంతో కీలకమైనవి. శ్రీలంక అంతర్గత రాజకీయాల్లో తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ, భారత అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం లేకుండా నిరంతరాయంగా అమలు అవుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలా సిరిసేనా, ప్రధాని రనీల్ విక్రమసింఘేల మధ్య ఉన్న తీవ్ర అభిప్రాయ విభేదాల కారణంగా రానున్న అధ్యక్ష ఎన్నికలు, ఆ వాతావరణం రణరంగాన్ని తలపించేలా ఉండనున్నాయి. వీరి మధ్య అభిప్రాయవిభేదాలు పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు కారణం అవుతున్నాయి కూడా. పైగా ఈస్టర్ సండే దాడులు శ్రీలంక రక్షణ పరిస్థితులను గందరగోళంలోకి నెట్టాయి. శ్రీలంకలోని రాజకీయంగా నెలకొన్న ఈ సంక్షోభ వాతావరణంలో భారత్ ఆచితూచి స్పందిస్తోంది. రాజ్యాంగపద్ధతిలో వారి మధ్య విభేదాలను పరిష్కరించుకోవాల్సిందిగా దేశ నాయకత్వాన్ని భారత్ కోరుతోంది. భద్రతా అంశాల విషయానికి వస్తే, సరిహద్దు ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఉగ్రవాదధోరణులపై అంతర్జాతీయ సమాజం ఏకతాటిపై నిలబడి పోరాడాలని కోరింది.

ఓడరేవుల్లాంటి వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులను భారత్ పెంచుతోంది. ‘ఈస్ట్ కంటైనర్ టెర్మినల్’ని కొలంబో ఓడరేవులో సంయుక్తంగా అభివృద్ధి పరచాలని ఇండియా, జపాన్, శ్రీలంకలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ మూడు దేశాలు తీసుకున్న జాయింట్ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో చైనా కొనసాగిస్తున్న ఆధిక్యధోరణులకు చెక్ పెట్టగలవు. అతి ముఖ్యమైన శ్రీలంక హంబాన్‌టోటా ఓడరేవుపై 99 సంవత్సరాల లీజును బీజింగ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

కొత్త రైల్వై లైను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైంది. ఇది మతారా కోస్టల్ సిటీని హంబాన్‌టోటాలోని బెలియాట్టాలను అనుసంధానం చేస్తుంది. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ (బిఆర్ఐ) కింద శ్రీలంకలోని రైల్వే ప్రాజక్టుల మీద చైనా పెట్టిన తొలి పెట్టుబడి ఇది.

45.27 మిలియన్ల ఆర్థిక సహాయంతో శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్సులో ఉన్న కన్‌కెసంతురై ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. 3.85 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చమురు శుద్ధి కర్మాగారాన్ని హమ్‌బాన్‌టోటా సమీపంలో నిర్మంచేందుకు పునాది రాయిను వేశారు. ఈ ప్రాజెక్టు సింగపూర్‌లో నమోదైన ఒక సంస్థ భారత వాణిజ్యవేత్తలతో, ఒమన్ చమురు మంత్రిత్వశాఖలతో కలిసి సంయుక్తంగా చేపట్టింది. హంబాన్‌టోటా సమీపంలో బహుళదేశాలు సంయుక్తంగా పెట్టిన పెట్టుబడితో జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని శ్రీలంక ప్రధాని ఆహ్వానించారు. శ్రీలంకలోని ట్రింకోమలి ఓడరేవు, మటాలా విమానాశ్రయం రెండింటినీ కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో భారత్ ఉంది. కానీ విధాన నిర్ణయాలు,పెట్టుబడుల పరంగా ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది.

ఎనర్జీ, అనుసంధానం ఈ రెండు రంగాలపై కూడా భారత్, శ్రీలంక దేశాలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నాయి. ఈ విషయంలో ఇరుదేశాలు సహకారాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి. ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్’(జెడబ్ల్యుజి) విద్యుత్ రంగంలో సహకారం కోసం నాల్గవ పర్యాయం ఈ ఏడాది జూన్‌లో సమావేశమయ్యాయి. అందులో ట్రింకోమలి సమీపంలోని సాంపూర్ , కెరవాలపిటియాలో ఎల్ఎన్‌జి ప్రాజక్టులకు సంబంధించి సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సమీక్షచేశాయి కూడా.

జాతుల మధ్య ఘర్షణల కారణంగా అనుసంధానత ముఖ్యమైన అంశంగా సుదీర్ఘకాలంగా అక్కడ కొనసాగుతోంది. అలాగే కన్కసాంతురై, పాండిచ్చేరీ సమీపంలోని కరైకాల్ సమీపంలోని ఓడరేవుల మధ్య వాణిజ్యపర సేవల పెంపుదలకకు సంబంధించి కూడా అనుసంధానత అవసరం ఎంతో ఉంది. కన్కసాంతురై భారత్ సహాయంతో అభివృద్ధి జరుగుతుంది. దీంతో రెండు దేశాల మధ్య అనుసంధానత బాగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల వాణిజ్యం, పర్యాటకరంగాలకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ అంశాలన్నీ కూడా శ్రీలంకతో భారత సహకారం వైవిధ్యపరంగా కొనసాగుతోందన్న విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఏమైనప్పటికీ హిందూమహాసముద్ర ప్రాంతంలో తన వ్యూహాత్మక పట్టును భారత్ పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రచన:. డా. ఎం. సమత, ఇండియన్ ఓషన్ రీజియన్ వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన