పార్లమెంటులో ఈ వారం

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డా. ఎస్. జైశంకర్ పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత జాతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌ను విడుదల చేయాల్సిందిగా కోరారు. ఈ కేసుపై ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కుల్‌భూషణ్ జాదవ్‌ను విడుదలచేయాల్సిందిగా, అతన్ని తిరిగి స్వదేశానికి పంపించాల్సిందిగా మంత్రి జైశంకర్ పాకిస్తాన్‌ను కోరారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ దీనికి సంబంధించిన ప్రకటనను చేశారు. ఆ ప్రకటనలో భారత్, భారతదేశానికి చెందిన జాదవ్‌కే కాదు చట్టబద్ధ పాలన, అంతర్జాతీయ ఒప్పందాలపై గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని విస్పష్టంగా ఆహ్వానిస్తారన్నారు. అమాయకుడైన జాదవ్‌పై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని పేర్కొన్నారు. చేయని నేరాన్ని ఒప్పుకోమంటూ అతనిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. అతని తరపున వాదించేందుకు చట్టబద్ధ ప్రతినిధి కూడా లేరన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి మాట్లాడుతూ కాంస్యులర్ సంబంధాలకు సంబంధించిన వియత్నాం ఒప్పందం కింద ఉన్న నిబంధనలన్నీంటినీ కూడా పాకిస్తాన్ అతిక్రమించిందని ప్రకటించారు. జాదవ్‌కు ఉన్న హక్కుల గురించి ఆలస్యం చేయకుండా అవగాహన పరచాల్సిన బాధ్యత పాక్ మీద ఉంది. అంతేకాదు జాదవ్‌ను కలవడానికి భారత కాంస్యులర్ అధికారులకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలి. 


నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సవరణ) బిల్లు, 2019ని పార్లమెంటు ప్రవేశపెట్టింది. రాజ్యసభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. లోక్ సభ ఎప్పుడో ఈ బిల్లును ఆమోదించింది. భారతీయులను, విదేశాల్లో ఉన్న వారి ఆస్తులను టార్గెట్ చేస్తూ పాల్పడుతున్ననేరాలపై పరిశోధన చేసేందుకు వీలుగా ఏజెన్సీ పరిధిని విస్తృతపరచాలని ఈ చట్టం లక్ష్యం. ఇటీవల చేసిన సవరణతో మానవ అక్రమరవాణాకు సంబంధించిన నేరాలను, అలాగే నకిలీ కరెన్సీ, నిషేధించబడిన ఆయుధాల తయారీ లేదా అమ్మకాలు, సైబర్ ఉగ్రవాదం, ఎక్స్ పోలజివ్ సబ్‌స్టన్సెస్ యాక్ట్, 1908 కింద చేసిన నేరాలను కూడా అదనంగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. మానవ అక్రమ రవాణా, సైబర్ ఉగ్రవాదం వంటి షెడ్యూల్డ్ నేరాల విచారణకు గాను ప్రత్యేక న్యాయస్థానాలను ఇది ఏర్పాటుచేయనుంది. సభలో చర్చకు సమాధాన మిస్తూ హోం మంత్రి అమిత్ షా విదేశాల్లో ఉన్న భారతీయులపై ఉన్న ఉగ్రవాద కేసులను కూడా ఏజెన్సీ చేపట్టి పరిష్కరిస్తుందని సభకు భరోసా ఇచ్చారు. దేశ ప్రయోజనాల దృష్టిలోంచి కూడా ఏజెన్సీ స్పందిస్తుందన్నారు. 

అంతేకాదు న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లు, 2019ని కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో ఇది వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది. లోక్ సభలో ఈ బిల్లు ఎప్పుడో ఆమోదం పొందింది. ఈ బిల్లు న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఒక వ్యవస్థ కావాలని కోరుకుంటోంది. వ్యవస్థాగతమైన మధ్యవర్తిత్వం నిర్వహించే స్వతంత్రప్రతిపత్తి ఉన్న, సర్వతంత్ర స్వతంత్రంగా వ్యవహరించే పాలన కావాలనేది ఇందులో దాగున్న మరో ముఖ్య అంశం.

ఆర్థిక బిల్లు, 2019ని లోక్ సభ ప్రవేశపెట్టింది. దీనివల్ల 2019-2020 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు అమలులోకి వస్తాయి. పన్నుల చట్టాల్లో ప్రతిపాదించిన సవరణల గురించి వివరిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత దేశం ‘మేక్ ఇన్ ఇండియా’తో పాటు కొత్త స్టార్టప్‌లను ఇవి ప్రోత్సహిస్తాయని తెలిపారు. 


రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ లోక్ సభలో మాట్లాడుతూ ఇండియా, చైనా రెండూ ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తున్నాయన్నారు. వీటి ద్వారా సరిహద్దుల వెంబడి శాంతి, సౌఖ్యాలు వెల్లివిరుస్తాయని ఇవి అభిప్రాయపడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. సభలో కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడుతూ చైనా పౌరులు ఈ నెల ఆరవ తేదీన దలైలామా జన్మదినోత్సవ సందర్భంగా వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న డెమ్‌కోక్ సెక్టర్‌లోకి ప్రవేశించారంటూ ఆరోపించారు. దానికి మంత్రి రాజ్‌నాధ్ మాట్లాడుతూ దోల్కమ్ వద్ద రెండు దేశాలకు చెందిన సైన్యం ఎంతో నిగ్రహంతో వ్యవహరించాయని ఆయన పేర్కొన్నారు. 

హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఒక ప్రశ్నకు రాజ్య సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులో కేంద్ర ప్రభుత్వం దేశంలో చట్టవిరుద్ధ వలసలను నివారించే పలు చర్యలను చేపట్టిందని తెలిపారు. వీటిల్లో అంతర్జాతీయ సరిహద్దుల్లో కంచెను ఏర్పాటు చేయడం, సరిహద్దు గస్తీ దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించేలా సమాయత్తపరడం వంటి అంశాలు ఉన్నాయి. 

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ లోక్ సభలో మాట్లాడుతూ నిరంతరాయంగా న్యూ ఢిల్లీ చేపట్టిన ప్రయత్నాల మూలంగా విజయవంతంగా 2,110 మంది భారత నిర్బంధితులను విడుదల చేయడమే కాకుండా స్వదేశానికి పంపడం జరిగింది. వీరితో పాటు 2014 నుంచి పాకిస్తాన్‌లో చిక్కుకున్న మత్స్యకారులను కూడా విడుదల చేశారు. 

నవంబరు, 2013 నాటికి ఆసియా-ఫసిఫిక్ గ్రూపు (ఎపిజి) కి ఒక్క సీటు అందుబాటులో ఉండడంతో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యుఎన్ఎస్‌సి) లో 2021-2022 టర్మ్‌ కి నాన్-పర్మినెంట్ సీటుకు భారత్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినట్టు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి స్పందించారు. 2021-22 కాలపరిమితికి నాన్-పర్మనెంట్ సభ్యత్వ స్థానాని కోసం భారత అభ్యర్థిత్వాన్ని 55 సభ్యులతో కూడిన ఆసియా ఫసిఫిక్ గ్రూప్ సభ్యులు ప్రతిపాదించారు. 2021-22కి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్-పర్మెనెంట్ సీటు కోసం న్యూయార్కులో 2020, జూన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 


రచన: వి. మోహన రావు, జర్నలిస్ట్




Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన