కర్తార్‌పూర్ కారిడార్ తుది ఒప్పందానికి చేరువలో భారత్, పాకిస్తాన్లు

 పాకిస్తాన్ వైపున ఉన్న వాఘా-అత్తారి సరిహద్దులో భారత్, పాకిస్తాన్ అధికారుల మధ్య రెండవ విడత చర్చలు జరిగాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ ఒప్పందం ఖరారు చేయడానికి సంబంధించిన విధాన పరమైన చర్చలు ఎంతో  ప్రగతిని సాధించాయి. దీనివల్ల సరిహద్దుల్లోని పాకిస్తాన్ నరోవాల్ జిల్లాలో ఉన్న చారిత్రాత్మక దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత యాత్రికులు సందర్శించే అవకాశం ఉంది. ఇది 16వ శతాబ్దానికి చెందిన గురుద్వారా. చారిత్రాత్మకంగా, మతపరంగా ఎంతో పేరున్న గురుద్వారా ఇది. సిక్కుల గురువు గురు నానక్ దేవ్ జీ తన తుది రోజుల్లో ఇక్కడే ఉన్నారు. అంతేకాదు 1539లో ఆయన తన తుది శ్వాసను ఇక్కడే విడిచారు. భారత, పాకిస్తాన్ల మధ్య తీవ్ర  ఉద్రిక్తల మధ్యనే సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు దర్బార్ సాహిబ్ గురుద్వారా క్షేత్ర దర్శనానికి సంబంధించి ఒక ఆశ చిగిర్చింది. సుదీర్ఘకాలంగా వస్తున్న ఒక కోరికకు పునాదిరాయి పడింది. భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కర్తార్‌పూర్ కారిడార్‌కు గత ఏడాది నవంబరు 26న పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్‌కు దగ్గరలో పునాదిరాయి వేశారు. అనంతరం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా సమీపంలో నిర్మాణోత్సవాన్ని నిర్వహించారు. 

రెండు దేశాల మధ్య కారిడార్‌కు సంబంధించిన తొలి విడత చర్యలు ఈ ఏడాది మార్చిలో జరిగాయి. అంతేకాదు మూడు విడతలుగా సంభాషణలు సాంకేతిక కమిటీల మధ్య జరిగాయి. ఇందులో ప్రాజక్టుకు సంబంధించిన అంశాల పరిష్కారంపై చర్చ జరిగింది. చర్చల్లో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన కమిటీలో ఖలిస్తాన్ అనుకూల శక్తులు ఉండడాన్ని భారత్ వ్యతిరేకించింది. దాంతో రెండవ విడత చర్చల్లో ఢిల్లీ  డిమాండును సమ్మతిస్తూ పాక్ వారిని తొలగించింది. రెండవ విడత చర్చల్లో యాత్రికులకు సురక్షితమైన వాతావరణం, రక్షణ పరిస్థితులు కల్పించాల్సిన అవసరాన్ని కూడా న్యూఢిల్లీ నొక్కి చెప్పింది. పాకిస్తాన్‌లో ఉన్న కొందరు వ్యక్తులు, సంస్థలకు సంబంధించి భారత్ ఒక పత్రాన్ని పాకిస్తాన్‌కు అందజేసింది. వీరు యాత్రికుల సురక్షిత ప్రయాణానికి భంగం కలిగించే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. ఈ అవకాశాన్ని ఈ సంస్థలు అందిపుచ్చుకుని యాత్రికుల్లో సెంటిమెంట్లను రెచ్చగొట్టే అవకాశం ఉందని న్యూ ఢిల్లీ అభిప్రాయపడింది. పాకిస్తాన్ దీనిపై స్పందిస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ కారిడార్‌లో భారత వ్యతిరేక శక్తుల కార్యకలాపాలు కొనసాగడానికి అనుమతించే ప్రసక్తే లేదని పాక్ విస్పష్టం చేసింది. భారత్‌కు గట్టి భరోసా ఇచ్చింది. 

గతంలో రోజుకు 500 నుంచి 700 మంది యాత్రికులనే ఈ క్షేత్రానికి పాకిస్తాన్ అనుమతించేది. దానికి భిన్నంగా ఇప్పుడు పాకిస్తాన్ రోజుకు 5,000 మంది యాత్రికులను వీసా లేకుండా అనుమతించడానికి అంగీకరించింది. ఇధి భారత పాస్‌పోర్టు ఉన్నవారితో పాటు ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఒసిఐ) కార్డు హోల్డర్లకు కూడా సంవత్సరం పొడుగుతా  కర్తార్ సాహిబ్ గురుద్వారాను సందర్శించుకునేలా వీలు కల్పించింది. యాత్రికులు అక్కడకు వాహనాల్లో వెళ్లొచ్చు. లేదా కాలినడకన వెళ్లొచ్చు. లేదా బృందాలుగా కూడా వెళ్లొచ్చు. ప్రత్యేక సందర్భాలలో మాత్రం పదివేల మంది అదనపు యాత్రికులను అనుమతించాల్సిందిగా ఈ చర్చల్లో భారత్ పునరుద్ఘాటించింది. వివిధ మత విశ్వాసాలకు సంబంధించిన యాత్రకులపై ఎలాంటి పరిమితులు కూడా ఉండకూడదని భారత్ కోరింది. గురునానక్ బోధలు సిక్కులకు, హిందువులకు కూడా పరమపూజ్యనీయమైనవి. అందుకే దేశంలో పంజాబ్, ఇతర ప్రాంతాల్లో ఉన్న పలు గురుద్వారాలను అందరూ దర్శిస్తుంటారు. సంస్కృతీపరంగా కూడా వీటిల్లో పోలికలు ఉండడం గురించి ఇస్లామాబాద్‌కు కూడా స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే వివిధ మతవిశ్వాసాలకు సంబంధించిన వారిని కూడా ఈ గురుద్వారా దర్శనానికి అనుమతించనున్నట్టు పాకిస్తాన్ స్పష్టంచేసింది. ఎలాంటి పరిమితులు వారిపై విధించబోమని కూడా ఈ సందర్భంగా పాకిస్తాన్ వెల్లడించింది. 

 దర్బార్ సాహిబ్ గురుద్వారా సందర్శనకు గతంలో యాత్రికుల నుంచి పాకిస్తాన్ రుసుమును వసూలు చేసేది. అంతేకాదు యాత్రికులకు పర్మిట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా పాకిస్తాన్‌కు ఉండేది. ఈ రెండు విషయాలను తిరిగి ఆలోచించవలసిందిగా పాకిస్తాన్‌తో భారత్ పునరుద్ఘాటించింది. 

మౌలికసదుపాయాలకు సంబంధించి తమ పరిమితులను ఈ సందర్భంగా పాకిస్తాన్ లేవనెత్తింది. భారత్ పెట్టిన పలు ప్రతిపాదనలను దశల వారీగా అమలుపరుస్తామని పాక్ తెలిపింది. అయితే పాత రావిపై  వంతెన నిర్మాణం వీలైనంత తొందరగా నిర్మించాలన్న దానికి కూడా పాక్ అంగీకరించింది. భారత్‌లో వంతెన నిర్మాణం జరుగుతున్నట్టే పాకిస్తాన్ కూడా తమవైపు వంతెనను నిర్మించడానికి సిద్ధమైంది. వరదల సమగ్ర అంచనా గురించి భారత బృందం ఎప్పుడైతే  పాకిస్తాన్‌కి సమాచారం ఇచ్చిందో దానివైపు నుంచి కూడా స్పందన వేగవంతమైంది. అలా భారత్ తన ప్రాంతంలో వంతెన నిర్మాణం చేస్తున్నట్టే పాక్ కూడా ఆ పనికి సంసిద్ధమైంది. వరదల వల్ల యాత్రికులకు ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితుల గురించి కూడా పాకిస్తాన్ ప్రతినిధివర్గంతో భారత్ పూర్తి స్థాయిలో చర్చించింది.

రెండు దేశాలూ పరస్పర సమాచార వ్యవస్థ నిర్వహణను చేపట్టాలని అంగీకరించాయి. కర్తార్ సాహిబ్ కారిడార్ ఒప్పందం ఖరారు దిశగా పనిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. పవిత్ర గురుద్వారా సందర్శించే యాత్రికులకు అనుసంధాన సౌకర్యంపై కమిటీ సభ్యులు మళ్లీ సమావేశం కానున్నారు. ఈ పరిణామాలు కర్తార్‌పూర్ కారిడార్ అనుకున్న సమయానికి అంటే నవంబరు, 2019 నాటికి పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఇదంతా గమనిస్తే గురునానక్ దేవ్ జి 550వ జన్మదిన  ఉత్సవాలు ఈ ఏడాది నవంబరు 12 నుంచి మొదలయ్యే నాటికి ముందునుంచే ఈ గురుద్వారా పుణ్యక్షేత్రానికి భక్తుల రాక మొదలవుతుందనిపిస్తోంది.



రచన: రతన్ సాల్దీ, రాజకీయ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన