పార్లమెంటులో ఈ వారం

న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్,2019 బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సహాయంతో న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇది దేశానికి సంబంధించిన ముఖ్య సంస్థ. ఎందుకంటే అతి పెద్ద ఆర్బిట్రేషన్ హబ్‌గా సమగ్ర అభివృద్ధి సాధనలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఈ బిల్లుపై బుధవారం పార్లమెంటులో జరిగిన చర్చలో న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ సమాధానం ఇస్తూ దేశాన్ని అంతర్జాతీయ, దేశీయ మధ్యవర్తిత్వానికి ముఖ్యమైన హబ్‌గా ఈ సెంటర్‌ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వెల్లడించారు. 

దీంతోపాటు పార్లమెంటు ఉభయసభలు మరో ముఖ్యమైన చట్టబద్ధ తీర్మానాన్ని చేపట్టాయి. అదేమిటంటే పాకిస్తాన్ నుంచి ఎగుమతి అయ్యే, లేదా పాక్ సరుకులపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీని విధించాలని తీర్మానం చేపట్టింది. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ లోని తొలి షెడ్యూల్‌లో సవరణకు ఉభయసభలు ఆమోదించాయి. అంతేకాదు ఇస్లామాబాద్ నుంచి వచ్చే అన్ని రకాల సరుకులపై ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 200 శాతం ప్రాథమిక కస్టమ్ డ్యూటీ విధించాలని న్యూ ఢిల్లీ నోటిఫై చేసింది. ఈ తీర్మానాలను కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ థాకూర్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ వ్యవసాయరంగం, విద్య, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజా వ్యయంతో సంబంధం లేకుండా ద్రవ్యం సంఘటితం చేయడానికి సైతం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2019-20 కేంద్ర బడ్జెట్‌పై బుధవారం జరిగిన చర్చకు లోక్ సభలో సమాధానమిస్తూ దేశంలో అత్యున్నత మార్పులకు నాంది పలికే ప్రతిపాదనలనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. అంతేకాదు ద్రవ్య లోటును 3.3 శాతంలో ఉండేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందన్నారు. తాత్కాలిక బడ్జెట్‌లో దీన్ని 3.4 శాతంగా యోచించిన విషయం అందరికీ తెలిసిందే. దానికి భిన్నంగా ప్రస్తుత బడ్జెట్ లక్ష్యం ఉండడాన్ని మనం గమనించవచ్చు. 

దేశీయ వ్యవహారాల సహాయమంత్రి జి కిషన్ రెడ్డి లోక్ సభలో మంగళవారం మాట్లాడుతూ సరిహద్దు చొరబాటుదారులు జమ్ము, కశ్మీర్‌లలో ప్రవేశించడం 2019 మొదటి భాగంలో 43 శాతానికి తగ్గిందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది బాగా మెరుగుపడిందన్నది స్పష్టమవుతోంది. జమ్ము-కశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనలు కూడా 28 శాతానికి పడిపోయా యని ఆయన తెలిపారు. అదే సమయంలో స్థానికంగా మిలిటెంట్లుగా చేరేవారి సంఖ్య సైతం 40 శాతానికి తగ్గిందని తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ రాజ్య సభలో సోమవారం ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ 2019 జూన్ వరకూ ఇండో-పాక్ సరిహద్దుల్లో 1299 కాల్పుల విరమణ అతిక్రమణలు జరిగాయని పేర్కొన్నారు. వీటి సంఖ్య గత ఏడాదిలో 1629 ఉన్నాయి. ఈ లెక్కల బట్టి కాల్పుల విరమణ అతిక్రమణలు గత ఏడాది కన్నా బాగా తగ్గాయని తేలుతోంది. 

కేంద్ర అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గగన్‌యాన్ ప్రాజక్టు భారత 75వ స్వాతంత్రదినోత్సవం నాటికి లేదా అంతకన్నా ముందే పట్టాలెక్కనుందన్నారు. దాని డిజైన్, భారీ సబ్‌సిస్టమ్స్ ఆకృతీకరణ అంతా సంసిద్ధంగా ఉన్నాయి. హ్యూమన్ రేటింగ్ ఫ్లైట్ సిస్టమ్స్‌కు సంబంధించిన అర్హత పరీక్షలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. అంతేకాదు క్రయోజెనిక్ ఇంజెన్ పరీక్షలు కూడా ముందుకు సాగుతున్నాయి. ఒక సభ్యుని ప్రశ్నకు సమాధానంగా ఈ అంశాలను మంత్రి గురువారం రాజ్య సభలో పేర్కొన్నారు. అంతేకాదు వివిధ సంస్థలకు చెందిన, పరిశ్రమలకు చెందిన రకరకాల వ్యక్తులు సభ్యులుగా ‘గగన్‌యాన్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్’ (గగన్‌యాన్ జాతీయ సలహా మండలి)ని కూడా ఏర్పాటుచేసినట్టు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 

బ్యాంకు అకౌంట్లను ప్రారంభించేందుకు ఆధార్‌ను రుజువుగా పెట్టేందుకు అనుమతిస్తూ పార్లమెంటు ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అంతేకాదు మొబైల్ అనుసంధానతను కూడా ఇందులో చేర్చారు. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ సభలో మాట్లాడుతూ కేంద్రం పటిష్టమైన డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని రూపొందిస్తోందన్నారు. ఈ చట్టాన్ని త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం ప్రపంచం భారత డేటా ప్రొటెక్షన్ వైపే చూస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం అందరినీ కలుపుకుపోయే దేశం. సంస్కరణలు, సాధికారతలకు నెలవు అని అభిప్రాయపడ్డారు. ఆధార్, ఇతర చట్టాల(సవరణల)బిల్లు,2019 ప్రకారం ఆధార్ డేటా సంబంధిత ప్రకరణలను అతిక్రమించిన పక్షంలో ఆ ప్రైవేటు సంస్థలకు కోటి రూపాయల జరిమానా, జైలు శిక్షలు ఉంటాయని వెల్లడించారు. అంతేకాదు ‘నో యువర్ కస్టమర్’ కింద స్వచ్ఛందంగా ఆధార్ నంబరును ఉపయోగించుకునే సౌలభ్యాన్ని కూడా ఇది కల్పిస్తుంది. 

కర్నాటకలో తలెత్తిన రాజకీయ పరిణామాల మీద రెండు సభల్లో నిరసనలు వెల్లువెత్తాయి. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలు ఇదే శైలిని కొనసాగించడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. లోక్ సభలో అధిర్ రంజన్ చౌధురీ మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్-జెడి(ఎస్) ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఉద్దేశంతో రాష్ట్రంలో ‘వెటాడే రాజకీయాల’ను బిజెపి అనుసరిస్తోందంటూ ఆరోపణలు చేశారు. బిజెపిని తీవ్రస్థాయిలో నిందించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చౌధురీ చౌధురీ చేసిన ఆరోపణలను కొట్టిపడేశారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరత, సంక్షోభాలతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.


రచన: వి. మోహన రావు, జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన