ఉన్నత స్థాయికి చేరుకుంటున్న భారత్-యుఎఇ సంబంధాలు

యుఎఇ విదేశాంగమంత్రి భారతదేశాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఐదుసార్లు పర్యటించారు. భారత్, యుఎఇ దేశాల మధ్య ఉన్న పటిష్ట సంబంధాలను తెలియచేయడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అవసరం లేదు. ఇరుదేశాలు కూడా పరస్పర స్నేహ సంబంధాలను ఆనందిస్తున్నాయి. ‘హిస్ హైనెస్’ అబ్దుల్లా బిన్ జయేద్ ఆల్ నహ్యాన్ యుఎఇ విదేశాంగ మంత్రి. భారత్‌తో అంతర్జాతీయ సంబంధాలను కూడా చూస్తున్న జయేద్ జూలై 7-9 తేదీ వరకూ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశానికి ఇది ఆయన ఐదవ పర్యటన. ఆయన పర్యటనలు సైతం ఇరుదేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సంబంధాలను మరింత దృఢపరుస్తాయనడంలో, ఉన్నతస్తాయికి చేరుస్తాయనడంలో సందేహం లేదు. అంతేకాదు చారిత్రకంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా సంబంధాలను సరికొత్త స్థాయికి మళ్లించనున్నాయి. ఉన్నత స్థాయికి చేర్చనున్నాయి కూడా. ప్రధాని నరేంద్ర మోదీ 2015 సంవత్సరంలో యుఎఇని సందర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంభంధాలు చిక్కనవడం ప్రారంభమైందని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకూ దాదాపు 34 సంవత్సరాలపాటు భారత్‌కు చెందిన ఏ ప్రధాని కూడా గల్ఫ్ దేశంలో పర్యటించలేదు. ఆ పర్యటనతో భారత ప్రధాని మోదీ, యుఎఇ దేశాలు రెండూ వ్యూహాత్మక భాగస్వామ్య శకంలోకి ప్రవేశించాయి. పైగా ‘భారత స్ట్రాటజిక్ పెట్రోలియం రీసేవ్ ప్రోగ్రామ్’ లో తొలుత పాల్గొన్న దేశం యుఎఇ . ప్రస్తుతం భారత్‌లో పర్యటించిన యుఎఇ విదేశాంగమంత్రి యుఎఇకి చెందిన ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత వైవిధ్యంగా కొనసాగడంలో ఎంతగానో సహయపడుతుంది.

యుఎఇ విదేశాంగమంత్రితో పాటు ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధులు కూడా భారతదేశానికి వచ్చారు. ఇది భారత్‌తో యుఎఇ వాణిజ్యపరమైన సంబంధాల పెంపుదల ఉద్దేశాన్ని స్పష్టంచేస్తోంది. ఈ రోజు జిసిసి దేశాలలో భారత మూడవ అతిపెద్ద ముఖ్య వాణిజ్య భాగస్వామ్య దేశం కూడా యుఎఇనే. అంతేకాదు ఎనర్జీ పరంగా నాల్గవ అతిపెద్ద దిగుమతిదారు కూడా. భారత దేశానికి చెందిన భిన్న జాతుల వారు యుఎఇలో 3.3 మిలియన్ల వరకూ ఉన్నారు. వీళ్లు యుఎఇ మొత్తం అభివృద్ధి ప్రక్రియలో కీలక పాత్ర వహిస్తున్నారు.

మనదేశంలో అబ్దుల్లా బిన్ జయేద్ ల్ నహ్యాన్ మూడు రోజులు ఉన్నారు. ఈ సమయంలో భారత విదేశాంగమంత్రి డా.జైశంకర్ కలిశారు. దౌత్యవేత్తగా పనిచేసిన జైశంకర్ ప్రస్తుతం విదేశాంగమంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల మంత్రులూ వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణరంగం, భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ, తీవ్రవాద వ్యతిరేక పోరాటం, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు వంటి పలు అంశాలపై చర్చలు జరిపారు. సిరియా, లెబనాన్, యెమన్‌లలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పరిణామాలను యుఎఇ విదేశాంగమంత్రి భారత విదేశాంగమంత్రి డా. జైశంకర్‌కు వివరించారు. అంతేకాదు ఇరువురూ ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న రాజకీయ, వ్యూహాత్మక పరిస్థితులపై కూడా తమ చర్చల్లో దృష్టిసారించారు. భారత-యుఎఇల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసే ప్రధాన అంశం ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటం. అందుకే దీనికి రెండు దేశాలూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంతేకాదు ఉగ్రవాదంపై అన్ని రకాలుగా, అన్ని మార్గాలలో పోరాడవలసిన అవసరాన్ని సైతం ఇరుదేశాల నాయకులు నొక్కిచెప్పారు.

రెండవ పర్యాయం ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్రమోదీని యుఎఇ విదేశాంగమంత్రి పర్యటన ముగింపు సమావేశాల అనంతరం కలిశారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకువెళ్లాలని రెండు దేశాల నాయకులు దృఢంగా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రెండు దేశాలు నిబద్ధతతో వ్యవహరించాలని భావించారు. ఈ సమావేశంలో రెండు దేశాలు కూడా సహకారాన్ని అందించుకునే పలురంగాల గురించి చర్చించారు. అబ్దుల్లా బిన్ జయేద్ ఆల్ నహ్యాన్ భారత ప్రధానిని 2018లో కలిశారు. అలాగే కేంద్ర పెట్రోలియం, సహజవనరుల శాఖ నిర్వహించిన సంయుక్త వర్కుషాపులో పాల్గొన్న సమయంలో కూడా మోదీని కలిశారు. దీనికి ముందు 2016, 2017 సంవత్సరాలలో కూడా ఆయన న్యూఢిల్లీ వచ్చారు. క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్‌తోపాటు ఆ సమయంలో ఆయన భారత్ వచ్చారు. ఇటీవల కాలంలో భారత్, యుఎఇల సంబంధాల్లో వేగవంతమైన మార్పు వస్తోంది. ఇంకొక ఆనందకరమైన విషయం ఏమిటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ ఛైయిర్ కూడా యుఎఇ. ఈ సంస్థ ఛైయిర్‌గా 2019, మార్చిలో జరిగిన ఒఐసికి 46వ విదేశాంగమంత్రుల మండలి సమావేశానికి గౌరవ అతిథిగా భారతదేశాన్ని యుఎఇ ఆహ్వానించింది కూడా.

ఇదంతా కూడా అరబ్ ప్రపంచదేశాలతో కొనసాగుతున్న సాధారణ సంబంధాలు, మరీ ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంతో కొనసాగుతున్న సంబంధాలను వెల్లడిస్తున్నాయి. అంతేకాదు భవిష్యత్తులో కూడా వీటితో సంబంధాలు అత్యున్నత పంథాలో కొనసాగేలా, అభివృద్ధి చెందేలా భారత ప్రధాని తన కృషిని కొనసాగిస్తున్నారు. పొరుగు దేశాల విషయంలో స్పష్టమైన విధానాలతో భారత్ ముందుకు సాగుతోంది. అంతేకాదు ఈ ప్రాంతంలో దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు శక్తివంతమైన బ్లూప్రింట్ కూడా మనదేశానికి సిద్ధంగా ఉంది. పైగా యుఎఇ విదేశాంగమంత్రి తాజా భారత పర్యటన పూర్తిగా గౌరవపురస్కరంగా చేపట్టింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనా కాలంలో ఇరుదేశాల మధ్య దృఢమైన సంబంధాలకు బీజం పడిందనే సందేశాన్ని తెలపేందుకు ఈ పర్యటనను యుఎఇ విదేశాంగమంత్రి చేపట్టారు. ఇదే తరహా సహకారం, స్నేహ సంబంధాలు ఎలాంటి మార్పులకు తావు లేకుండా భవిష్యత్తులో కూడా భారత్ నుంచి తాము అందుకుంటామనే ఆశాభావాన్ని కూడా ఈ సందర్భంగా యుఎఇ వ్యక్తంచేస్తోంది.

రచన: డా. ఫజ్జుర్ రహ్మాన్ సిద్దిఖి, పశ్చిమాశియా వ్యూహాత్మక విశ్లేషకులు


Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం