దోహలో అప్ఘన్ అంతర్ వ్యవహారాల చర్చలు

బహుషా ఇది అత్యాషే అవుతుందని భావించవచ్చు.. కానీ దోహాలో జరిగిన అప్ఘన్ కాన్ఫరెన్స్ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్న ఆ దేశంలో కించిత్తయినా శాంతి నెలకొల్పేందుకు ఉపయోగపడుతుందని భావించడం తప్పకాదు. దోహాలో జరిగిన కాన్ఫరెన్స్ శత్రు పక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చింది. అప్ఘన్ రాజకీయవేత్తలు, తాలిబన్ ప్రతినిధులకు మధ్య జరిగిన రెండు రోజుల సమావేశాన్ని అప్ఘన్ అంతర్గత వ్యవహారాల చర్చగా అభివర్ణించారు. ఈ చర్చలు అప్ఘనిస్తాన్ దాదాపు 18 ఏళ్ల పాటు కొనసాగుతున్న యుద్ధానికి చరమ గీతం పాడే దిశలో ఒక పునాదిగా భావించవచ్చు.

దేశ ప్రజలు గౌరవ ప్రదమైన జీవనం సాగించేలా, బతుకుకు భరోసా ఇచ్చేలా, ఆస్తులకు రక్షణ కల్పించేలా చూడాలనీ, సాధారణ పౌరుల ప్రాణాలు బలితీసుకోకుండా ఉండాలని దోహా చర్చల సందర్భంగా ఇరు పక్షాలు ఒక సంయుక్త ప్రకటన చేశాయి. దాదాపు 70 మంది రాజకీయవేత్తలు, పౌర సంస్థల కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు తాలిబన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అప్ఘన్ అంతర్ వ్యవహారాల చర్చ జర్మనీ, కతార్‌ల సహాయంతో జరిగింది. కతార్ రాజధానిలో కూడా చర్చలు చోటుచేసుకున్నాయి. తాలిబన్లు ఇంత వరకు కాబుల్‌లోని ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపేందుకు అంగీకరించలేదు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని చర్చలకు పూర్తిగా దూరంగా ఉంచారు. ఆయన ప్రభుత్వం చట్ట విరుద్ధమైనదని వారి వాదన.

కాగా, చర్చల సమయంలో మరికొన్ని ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. శాంతి చర్చల క్రమంలో అనేక రాజకీయాలు చోటుచేసుకున్నాయి. అమెరికా అప్ఘనిస్తాన్ భూబాగం నుంచి ‘‘పూర్తి స్థాయి’’లో తప్పుకోవాలనే హడావిడిలో ఉంది. వాషింగ్టన్ ఈ చర్చల క్రమాన్ని వేగవంతం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలను అంచనా వేయకుండానే తాలిబన్లది పైచేయి కావడానికి అమెరికా దోహదం చేస్తోంది. అప్ఘనిస్తాన్ పునారావాస మిషన్‌ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత సెప్టెంబర్‌లోనే జల్మే ఖలీల్‌జద్‌ని రాయబారిగా నియమించారు. ఖలీల్‌జద్ దోహాలో తాలిబన్ అధికారులతో ఏడు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ముఖ్యంగా నాలుగు అంశాలపై కొనసాగాయి. అవి.. అమెరికా దళాలను ఉపసంహరించుకోవడం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నివారణ, అప్ఘన్ అంతర్ వ్యవహారాలు, కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగాయి.

ఖలీల్‌జాద్ మాట్లాడుతూ శాంతి సంస్థాపన కాబుల్ చేతిలో ఉందని అనడం అర్థ సత్యమేనని వ్యాఖ్యానించారు. అప్ఘన్ మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ అమ్రుల్లా సలే కూడా మాట్లాడుతూ సమస్యలకు అసలు మూలం పాకిస్తాన్ అన్న రీతిలో వ్యాఖ్యానించారు. చర్చలపై ఆ దేశ ప్రభావం ఉందని అన్నారు. ‘‘దేశంలో శాంతి నెలకొల్పాలని కాబుల్ తీవ్రమైన సంకత్పంతో, స్థిరచిత్తంతో ఉంది. కానీ శాంతి రావల్పిండి/జీహెచ్‌క్యూలో బందీ అయివుంది’’ అని కొంత కాలం క్రితం వ్యాఖ్యానించారు.

అమెరికా తన బలగాలను ఏడాది లోపున ఉపసంహరించుకోవాలనే బలహీనత కారణంగా తాలిబన్లు ఆదేశాలు జారీ చేసే స్థాయికీ, పైచేయి సాధించేందుకు దోహదం చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. తాలిబన్లు పాకిస్థాన్‌కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చర్చల క్రమంలో కూడా వారు ఇస్లామాబాద్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నారు. తాలిబన్లు కేవలం పస్తూన్ జాతికి చెందిన వారు మాత్రమే కాదనీ, అందులో పాకిస్థానీయులకు చెందిన వారు కూడా ఉన్నారని నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్ ఒకటి నాటికి అమెరికా, నాటో బలగాలను ఉపసంహరించుకునే ప్రక్రియ మొదలవుతుందని అమెరికా అంటోంది. అందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను తయారుచేస్తోంది.

అదే సమయంలో సమావేశాల సందర్భంగా ఒక తీర్మాన వ్యాసం ప్రచురించారు. ఇందులో భద్రతా దళాలు, పౌరులపై 18 ఏళ్ల తాలిబన్ల సుదీర్ఘ కాలంగా సాగించిన యుద్ధాన్ని ‘‘జిహాద్’’గా అభివర్ణించారు. దీన్ని అప్ఘన్ సెనేట్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని సెనేటర్లు వాదించారు. అయితే బహుషా వారి ఉద్దేశం 1989లో సోవియట్ దళాల ఉపసంహరణ తర్వాత జిహాద్ ముగిసిందని కావొచ్చు. అయితే ఏ యుద్ధమైనా భవిష్యత్తులో జిహాద్ కాబోదు. ఈ మొత్తం వ్యవహారంలో అసలైన నీతి ఏమిటంటే శాంతి చర్చల రహదారి నల్లేరు నడక కాదు. మార్గమధ్యమంలో అనేక అవాంతరాలు ఉన్నాయి. అయితే ఆశాజనకమైన పరిణామం ఏమిటంటే ఈ సమావేశం కనీసం మంచును కరిగించేందుకు ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో ఇరు పక్షాలు పట్టువిడుపును ప్రదర్శించే అవకాశం ఉంది. అప్ఘనిస్తాన్‌లో శాంతి స్థాపనకు సరైన దిశలో ఒక అడుగు ముందుకు పడిందని మాత్రం భావించవచ్చు.

అప్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ శాంతి చర్చల ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని ఆశించారు. ‘‘అప్ఘన్ ప్రజలు అంతర్ అప్ఘన్ చర్చల ద్వారా శాంతి స్థాపన సాధ్యమని నమ్మినపుడే పరిస్థితులు మెరుగుపడతాయ’’ని ఆయన అన్నారు. అప్ఘన్ ప్రజల మదిలో ఉన్న భావనను ఆయన ఈ విధంగా వ్యక్తీకరించారని భావించవచ్చు. గత నెలలో జరిగిన ఎస్‌సీవో సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అప్ఘనిస్తాన్‌లో సుస్థిరత నెలకొనే క్రమం సాగాలని, శాంతియుత, భద్రతాపరమైన, సౌభాగ్యవంతమైన అప్ఘనిస్తాన్ రూపొందాలని ఆకాంక్షించారు. ఎస్‌సీవో ప్రాంతంలో భద్రత నెలకొనాలని కూడా ఆయన ఆశించారు. భారత దేశం అప్ఘనిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి స్థాయి మద్దతు తెలుపుతోందన్నారు. అప్ఘన్ చొరవతో, అప్ఘన్ నేతృత్వంలో, అప్ఘన్ ఆధీనంలో అప్ఘనిస్తాన్ ప్రజల కోసం శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు భారత దేశం అన్ని విధాల అండగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.

విషాదకరమైన విషయం ఏమంటే అప్ఘనిస్తాన్ ఎప్పుడూ ‘‘గ్రేట్ గేమ్’’కి క్రీడా స్థలంగా మారిపోతుంటుంది. వివిధ దేశాలు సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా సాగించే పోరాటంలో అప్ఘనిస్తాన్ బలి అవుతూ ఉంటుంది. ఆయా దేశాలు ఈ క్రమంలో అప్ఘన్‌ను నియంత్రించాలనీ, తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరుకుంటుంటారు. అందుకే అప్ఘన్‌లోని ఒక సెక్షన్ బుద్ధి జీవులు దీనిపై నిరంతరం హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. ప్రస్తుత పరిణామ క్రమంలో కూడా అత్యంత జాగురుకతతో వ్యవహరించాలనీ, లేనిపక్షంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా మారిపోతాయని అంటున్నారు. కాబూల్‌లో మళ్లీ తాలిబన్ల అణిచివేత శకం మొదలవుతుందంటున్నారు. చైనా ప్రాంతీయ ప్రయోజనాలకు అనుకూలంగా భారత్‌తో కూడిన ఈ భూభాగంలో జిహాదీ కొనసాగింపు జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 

రచన : సునీల్ గటాడే

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం