కొత్త శిఖరాలను అందుకుంటున్న భారత ఆర్థికరంగం

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికరంగ దేశాలలో ఐదవ దేశమైన యుకె స్థానాన్ని ఈ సంవత్సరం భారత్ సొంతం చేసుకోనుందని విశ్లేషకులు అంటున్నారు. 2025 సంవత్సరం నాటికి ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో జపాన్‌ని దాటి భారత్ రెండవస్థానానికి చేరుకోనుందని కూడా అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించారు. లండన్ స్థావరంగా పనిచేస్తున్న ‘ఐహెచ్ఎస్ మార్కిట్’ నివేదిక ప్రధాని నరేంద్రమోదీ, ఆయన పార్టీ దేశ పార్లమెంటరీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ రెండవసారి దేశ అధికారపగ్గాలు చేపట్టిన మోదీ నాయకత్వంలో మన దేశ ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో మరింత సానుకూలంగా ఉండొచ్చని పేర్కొంది. అంతేకాదు 2019-2023 సంవత్సరాల మధ్య భారత జిడిపి వృద్ధి రేటు కనీసం ఏడు శాతం మేర ఉంటుందని పేర్కొంది.

‘‘2019లో భారత్ అంతర్జాతీయంగా ఐదవ అతిపెద్ద ఆర్థికరంగ అభివృద్ధి దేశంగా నిలవనుందని అంచనాలు చెపుతున్నాయి. మొత్తం జిడిపి పరిమాణం మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లను దాటి పోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ కింగ్డమ్‌ని సైతం అధిగమించవచ్చని చెప్తున్నారు. 2025 నాటికి భారత జిడిపి జపాన్‌ని దాటుతుందని, దీంతో భారత్ ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో రెండవ అతిపెద్ద ఆర్థికరంగంగా భారత్ నిలవనుంద’ని కూడా ఈ నివేదిక చెప్తోంది.

అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ఉన్న దేశాల సరసన భారత్ అంచెలంచెలుగా ముందుకు కొనసాగుతున్న పరిస్థితిలో సహజంగానే గ్లోబల్ జిడిపి వృద్ధి రేటు కూడా వేగం పుంజుకుంటుంది. అలాగే భారత్ కూడా ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలోని అతి పెద్ద ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న దేశాలలో ఒకటిగా ఆసియా ప్రాంత వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంచడంలో సహాయపడుతుంది.

రెండవ పర్యాయం మోదీ అధికారపగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ‘భారత ప్రభుత్వ ముఖ్య ప్రాధాన్యం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు మొండి రుణాల భారాన్ని బ్యాలెన్స్ షీట్లలో తగ్గించడానికి సంస్కరణలను కొనసాగించాల్సి ఉంటుంది’ అని కూడా ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక నొక్కిచెప్పింది.


దేశ జిడిపిలో తయారీరంగంలో ఉండాల్సిన 25 శాతం వాటా ఇంకా 18 శాతమే ఉంది. అంతేకాదు రానున్న రెండు దశాబ్దాల కాలంలో సంవత్సరానికి కనిష్టంగా 7.5 మిలియన్ల మంది భారత వర్కుఫోర్సులో చేరతారంటున్నారు.

పెరుగుతున్న భారత మొత్తం జనాభాలో 2015 -2050 మధ్యకాలంలో 350 మిలియన్ల మంది అధికం కావొచ్చని నివేదిక సూచించింది. ఈ పరిస్థితి ప్రభుత్వానికి ఆర్థికంగా పెను సవాళ్లను సృష్టిస్తుంది. ముఖ్యంగా విద్యుత్, పారిశుద్ధ్యం, తక్కువ ఖర్చుతో కూడిన ఇళ్ల నిర్మాణం, ప్రజా రవాణా వంటి వాటిల్లో భౌతిక మౌలిక సదుపాయాల కల్పన పరంగా సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని కూడా ఈ నివేదిక పేర్కొంది.

‘మేక్ ఇన్ ఇండియా’ వ్యూహం ద్వారా భారత్ పారిశ్రామికరంగాన్ని పూర్తిగా మార్చాలన్నది వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తయారీరంగ ఉత్పత్తి పెరుగుదలను మెరుగుపరచడానికి, ఉపాధి అవకాశాల పెంపుకు ఇది అవసరం అవుతుంది. 2014లో ‘మేక్ ఇన్ ఇండియా’ వ్యూహాన్ని అమలుచేసినపుడు, జిడిపిలో తయారీరంగ సేవల పెంపును 25 శాతం వృద్ధిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఏమైనప్పటికీ 2018 నాటికి జిడిపిలో తయారీ రంగ వాటా ఇంకా 18 శాతమే ఉండడం గమనార్హం.

ప్రధాని నరేంద్రమోదీ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు మౌలిక సదుపాయాల అభివృద్ధి పరంగా ఎన్నో కీలక విజయాలను సాధించినా, వివిధ రంగాలలో అంటే రవాణా, విద్యుత్ మౌలిక రంగాలలో వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం అలాగే ఉంది. ప్రభుత్వంలో కొనసాగుతూ వస్తున్న రెడ్‌టేపిజం భారం కూడా తగ్గించాలన్నది ప్రాధాన్యం పొందింది. ప్రపంచ బ్యాంక్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 సూచిక’లో ప్రపంచంలోని మొత్తం 190 దేశాలలో భారత్ 77వ స్థానంలో నిలిచింది.

ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధాని భారీ విజయం రానున్న ఐదు సంవత్సరాలలో పటిష్టమైన ఇదే ఆర్థిక విధానాన్ని కొనసాగించే అవకాశాన్ని అందించింది. బలహీనమైన, చీలకలుపీలికలుగా ఉండే సంకీర్ణ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏర్పడలేదు కాబట్టి అనిశ్చిత, ఇతర భయాలు తలెత్తవు. ఎందుకంటే ఆ పరిణామాలు సహజంగానే ఆర్థిక సంస్కరణల వేగాన్ని బలహీనపర్చడమే కాదు దేశ ఆర్థికరంగం మరిన్ని సమస్యల్లో కూరుకునేలా చేస్తుంది.

గత ఐదు సంవత్సరాల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్థిరమైన, పటిష్టమైన స్థూల-ఆర్థికాభివృద్ధిని సాధించారంటూనే, మోదీ ప్రభుత్వం అనుసరిస్తూ వస్తున్న ఆర్థిక మార్గం పట్ల ఓటర్లు విశ్వాసాన్ని వ్యక్తంచేయడం ఈ ఎన్నికల్లో విస్పష్టంగా గోచరించిందని కూడా ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక ప్రస్తావించింది.

ప్రధాని మోదీ 2014లో పదవీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భారత జిడిపి 50 శాతం పెరిగింది. అంటే 2014లో రెండు ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నది కాస్తా 2019 నాటికి మూడు ట్రిలియన్లకు చేరుకుంది. అంటే కేవలం ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల పెరుగుదల జిడిపిలో కనిపించింది.

ప్రధాని మోదీ నాయకత్వంలో సాధించిన ప్రధాన ఆర్థిక విధాన సంస్కరణ అంటే వస్తుసేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ జిఎస్‌టి). దీనిని 2017లో ప్రవేశపెట్టారు. దేశంలో అందరికీ ఒకే పరోక్ష పన్నుల విధానాన్ని ప్రారంభించారు. గతంలో ఉన్న సంక్లిష్ట పన్నుల వ్యవస్థను మోదీ ప్రభుత్వం తొలగించింది. గతంలో రాష్ట్రాల వారీగా వివిధ రీతిల్లో పరోక్ష పన్నులు ఉండేవి. ఇవేవీ బలంగా , సమర్థవంతంగా లేవు. రాష్ట్రం మొత్తం ఉత్పత్తులను సరఫరా చేసే సంస్థల లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా ఉండేది. జిఎస్టీ విధానం లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడమే కాదు పారిశ్రామిక పోటీతత్వాన్ని సైతం బాగా మెరుగుపరిచింది.

రచన: పదం సింగ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం