పార్లమెంటులో ఈ వారం

దేశ ప్రజల అభిలాషలకు అనుగుణంగా భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్, ఎన్డీఎ) ప్రభుత్వం దృఢమైన, భద్రతతో కూడిన, సంపద్వంతమైన, సమ్మిశ్రితమైన భారత నిర్మాణం దిశగా పయనిస్తోందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ స్ఫూర్తితో ఎన్డీఎ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ప్రాంగణంలో ఉభయసభలైన లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచీ ఎన్డీఎ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా కృషి మొదలెట్టింది అన్నారు. పరిపాలనా పరంగా తలెత్తుతున్న రకరకాల సమస్యల నుంచి ప్రజలను విముక్తులను చేయడం ద్వారా, అలాగే వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రజల జీవనప్రమాణాల పెంపుదలకు ఎన్డీఎ ప్రభుత్వం పూనుకుందన్నారు. 

మొదటి పర్యాయం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేపట్టిన కార్యకలాపాలను ప్రజలు సునిశితంగా అంచనావేశారని అందుకే రెండవ పర్యాయం కూడా బిజెపి సారథ్యంలోని ఎన్డీఎ కూటమికే అధికార పగ్గాలు కట్టబెట్టారని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. బిజెపికి చెందిన సగానికి సగం మంది సభ్యులు తొలిసారిగా ఎంపీలుగా ఎన్నికయ్యారన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మహిళా ఎంపీలు ఎన్నికై చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. ప్రభుత్వం ప్రధానంగా గ్రామీణ భారతాన్ని పటిష్టం చేసే దిశగా దృష్టి పెట్టిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అలాగే మహిళా సాధికారత బిజెపి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యతా అంశాలని రాష్ట్రపతి కోవింద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అభివృద్ధిచెందిన దేశానికి సమాజం, ఆర్థిక రంగాలలో మహిళల పాత్ర ఒక పెద్ద పరీక్ష లాంటిది. ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల జాబితాను ప్రస్తావిస్తూ ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని ప్రతి ఒక్క రైతుకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా వివిధ చర్యలను చేపట్టింది కూడా. అంతేకాదు తన ప్రసంగంలో అంగళ్లను నడిపే వారికి, అలాగే రిటైల్ వ్యాపారస్తులకు పింఛను పథకాన్ని ప్రభుత్వం చేపట్టడంపై రాష్ట్రపతి ప్రశంసలను కురిపించారు. 

అలాగే రాష్ట్రపతి కోవింద్ ‘ఒక దేశం-ఒక ఎలక్షన్’ ప్రతిపాదనను అందరు ఎంపీలు గుర్తించాలని కోరారు. అలాగే త్రిపుల్ తలాక్ విధానాన్ని(విడాకులు) తొలగించాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘నిఖా-హలాల్’ కూడా. వీటి లక్ష్యం దేశంలోని అందరు సోదరీమణులు, కూతుళ్లకు సమానహక్కులను అందిచడమేనని ఆయన పేర్కొన్నారు. ఐదు వారాల పాటు కొనసాగిన ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ 17వ లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు తక్కువ సంఖ్యలో ఉండడం పట్ల ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని విజ్ఘప్తి చేశారు. మోదీ ఈ ప్రారంభ వాక్యాలతో ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. దేశ సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పక్షపాత రహితంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని అంశాలపై కృషి కొనసాగిస్తామని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో బలమైన, నిత్యచైతన్యమైన ప్రతిపక్షం ఎంతో అవసరమని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజున మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రతిపక్షం ప్రతి మాటా ఎంతో విలువైందని మోదీ అన్నారు. గత నెలలో వచ్చిన ఎన్నికల ఫలితాలు పలు కొత్త విషయాలను బయటకు తీసుకువచ్చాయని అభిప్రాయపడ్డారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎఫ్పుడూ లేని విధంగా అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారని, అలాగే మహిళా ఓటర్ల సంఖ్య కూడా పెరిగిందని , పార్లమెంటులో ఈ పర్యాయం అధికసంఖ్యలో మహిళా ఎంపీలు ప్రవేశించారని మోదీ ఆనందాన్ని వ్యక్తంచేశారు. కొత్తగా పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులకు మోదీ అభినందనలు చెప్పారు. తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టిన ఎంపీల వల్ల దేశానికి సేవ చేయాలనే కొత్త ఆశ, కోరికలు, సరికొత్త పట్టుదల, చైతన్యం పార్లమెంటులో ప్రతిఫలిస్తూ కొత్త ఆశలు వెల్లువెత్తాయన్నారు. 

దీనికి ముందు పార్లమెంటు సమావేశం కాగానే తాత్కాలిక స్పీకర్‌గా వీరేంద్ర కుమార్ ఎంపీల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓం బిర్లాను 17వ లోక్ సభ స్పీకర్‌గా బుధవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓం బిర్లా రాజస్తాన్‌లోని కోటా-బండి నుంచి రెండవ పర్యాయం బిజెపి ఎంపీగా గెలిచారు. కొత్త స్పీకర్ ఎంపిక తీర్మానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రతిపాదించారు. ప్రధాని ప్రతిపాదనకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్, నితిన్ గడ్కరీలు మద్దతుపలికారు. 

ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో పెద్ద ఎత్తున భూకంపం వచ్చినప్పుడు బిర్లా అందించిన అపురూప సేవలను మర్చిపోలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరు నాయకులూ కొత్త స్పీకర్‌ను అభినందించారు. పలు నాయకులు తనకు చేసిన సన్మానానికి స్పందిస్తూ సభను సరిగా నడపడంలో ప్రిసైడింగ్ అధికారిలా తన బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిస్తానని స్పీకర్ బిర్లా అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. ఆతర్వాత ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ అన్న నినాదాల మధ్య బిర్లాను ప్రధాని మోదీ స్పీకర్ పోడియం దగ్గరకు గౌరవపురస్కరంగా తీసుకెళ్లారు. ప్రధానిమంత్రి మోదీ సభకు తన కొత్త మంత్రివర్గ సభ్యులను కూడా పరిచయం చేశారు.

రచన: వి. మోహన రావు, జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన