పార్లమెంటులో ఈ వారం

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ భారతదేశాన్ని తమ ప్రభుత్వం మరింత ఉన్నత స్థాయికి తీసుకువెడుతుందన్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు తమ సహకారాన్ని అందించాలని కోరారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి కృతజ్ఘతలు తెలిపే తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రగతి పథంలో దూసుకుపోవడానికి అందివచ్చే ఏ అవకాశాన్ని భారత్ వదలదని ఆయన అన్నారు. భారత ప్రగతి, సుసంపన్నతలే ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న అన్ని రకాల సవాళ్లను ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కలిసి పరిష్కరించే దిశగా పనిచేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దృఢమైన, సురక్షితమైన, అందరినీ కలుపుకుపోయే భారతాన్ని ఆవిష్కరించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అవినీతి ప్రక్షాళణ, రైతుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను లేవనెత్తారు. దేశంలో అవినీతికి తావే లేదని ప్రధాని స్పష్టంచేశారు. అవినీతి ప్రక్షాళన కోసం తమ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. దేశంలోని నీటికరువు సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ దేశంలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే తన ప్రభుత్వ ముఖ్యమైన మంత్రమని ఉద్ఘాటించారు.

రాజ్యసభలో చర్చకు సమాధానమిస్తూ ఎన్నికల సంస్కరణలు దేశానికి ఎంతో ముఖ్యమైన అంశమని ప్రధాని అన్నారు. సరికొత్త భారత నిర్మాణంపై ప్రతి ఒక్కరూ సుదీర్ఘంగా ఆలోచించాలని కోరారు. దేశంలోని ప్రజలకు సలభమైన జీవనశైలిని అందించాలన్న విషయంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందరూ కొత్త భారతాన్ని నిర్మించడంలో కలసికట్టుగా పనిచేయాలని కోరారు. భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మలిచే ప్రయత్నంలో అందరూ సమిష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.


నూతన భారతం అనే బిజెపి ప్రభుత్వ ఆలోచనను ప్రతిపక్షాలు హేళన చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తిప్పిగొట్టారు. అలాగే దేశం అంతటా ఒకేసారి ఎన్నికల నిర్వహణను కూడా ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. దానిని కూడా మోదీ తన ప్రతివిమర్శలతో తిప్పిగొట్టారు. రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకుడు గులాం నబి అజాద్ తాను మంచిగా ఉన్న పాత భారతదేశాన్నే కోరుకుంటున్నట్టు చేసిన వ్యాఖ్యలకు ప్రధాని స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పాత భారతాన్నే కోరుకుంటుందోని విమర్శించారు. మంత్రివర్గ నిర్ణయాల వంటి విషయాలతో పాటు వ్యక్తిగత పర్యటనల కోసం నావల్ షిప్స్‌ ను ఉపయోగించడం వంటి అంశాలను లేవనెత్తుతూ అలాంటి పాత భారతాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించడాన్ని ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మెషీన్ల పనితీరుపై ప్రతిపక్షాలు అనుమానాలను వ్యక్తంచేయడంపై తీవ్రంగా స్పందించారు.


లోక్ సభ స్పెషల్ ఎకనామిక్ జోన్ అమెండ్‌మెంట్ బిల్, 2019‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనిద్వారా ట్రస్టులను, ప్రత్యేక ఆర్థిక మండలులలో తమ సంస్థలను ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది. న్యాయశాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆధార్, ఇతర చట్టాలు (సవరణ) బిల్లు,2019ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2019 మార్చిలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రవేశపెడతారు. దీనిననుసరించి నిబంధనలను అతిక్రమిస్తే తీవ్రమైన జరిమానాలు వేస్తారు. అంతేకాదు ఇది పిల్లలకు 18 ఏళ్లు వచ్చేదాకా బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చే ఎంపికను కూడా ఇస్తుంది.


కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి జమ్ము,కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ)బిల్లు, 2019ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది జమ్ము, కశ్మీర్ రిజర్వేషన్ చట్టం, 2004లో మరిన్ని సవరణలను కోరుతూ చేపట్టింది. జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దులోని పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో రిజర్వేషన్, ఆ పరిధిలోకి వచ్చే ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు వంటి అంశాలను ఇందులో ప్రతిపాదించారు.


కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీధరన్ లోక్ సభ సభ్యుని ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ న్యూఢిల్లీ సరిహద్దు తీవ్రవాదం సమస్య గురించి నిరంతరాయంగా లేవనెత్తుతూనే వస్తోందని సమాధానమిచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం అవసరం ఎంతో ఉందన్నారు. అంతేకాదు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికల్లో కూడా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆపకుండా కొనసాగిస్తున్న నిరంతరాయ కృషితో పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం పట్ల అంతర్జాతీయంగా ఆందోళనను లేవనెత్తగలిగామన్నారు. అంతేకాదు అంతర్జాతీయంగా డిజైన్ చేసిన ఉగ్రవాద కార్యకలాపాలు, సంస్థలు, వ్యక్తుల కార్యకలపాల కొనసాగింపు సమస్యలను కూడా లేవనెత్తుతూ వస్తున్నామన్నారు. ఏ రీతిలో కూడా పాకిస్తాన్‌లో ఉగ్రవాదకార్యకలాపాలకు అవకాశం ఇవ్వొద్దని ఎన్నోదేశాలు పిలుపునిచ్చినట్టు మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. పుల్వామాలో జరిగిన సరిహద్దు ఉగ్రవాద దాడి అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించడమే కాదు దాన్ని తీవ్రమైన దుశ్చర్యగా, పిరికిపంద చర్యగా అభివర్ణించిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.


రాజ్యసభ సభ్యులు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర నీటి సంక్షోభంపై ఆందోళన వ్యక్తంచేశారు. స్వల్పకాలపరిమితితో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ జల్ శక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భూగర్భజలాల పరిమాణాల పరిరక్షణకు అన్ని వైపుల నుంచి కృషి కొనసాగుతుందని స్పష్టంచేశారు.

----------------











Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన