అభివృద్ధి ఎజెండాను మరోసారి నొక్కిచెప్పిన ప్రధాని

రెండవసారి మోదీ భారత ప్రధానిగా పదవీ పగ్గాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేద ప్రజల సంక్షేమం, అత్యాధునిక మౌలికసదుపాయాల అభివృద్ధి తన ప్రభుత్వం యొక్క రెండు అంశాలతో కూడిన ప్రధాన ఎంజెండా అని ప్రపంచానికి చాటారు. పార్లమెంట్ రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో మోదీ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. దేశానికి, ప్రజల ప్రయోజనాలకు కావలసినవి ఏమిటన్నదానిపై మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ దృక్కోణాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం అమితంగా విశ్వసిస్తుందన్నారు. అలాగే అత్యాధునిక మౌలికసదుపాయాల విషయంలో కూడా కేంద్రం ఎంతో నమ్మకంతో ముందుకు అడుగేస్తుందన్నారు. అభివృద్ధి లక్ష్యం నుంచి ప్రభుత్వం పక్కదారి పట్టే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టంచేశారు. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనూ అభివృద్ధి ఎజెండాను నీరుగార్చే ఉద్దేశం కూడా లేదని తెలిపారు. ‘దేశం ప్రగతి దిశగా సాగడం చాలా ముఖ్యం. దీనివల్ల ప్రతి భారతీయుడు సాధికారతను సాధించగలుగుతాడు. అంతేకాదు మనదేశంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి’ అని మోదీ వివరించారు.

గత ఐదు సంవత్సరాల కాలంలో రైతులకోసం, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న ప్రజలకోసం ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాదు కేంద్రం దేశాన్ని అత్యాధునిక పథంలోకి తీసుకెడుతోంది కూడా. ప్రతిష్టాకరమైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రస్తుతం ఉన్న ఆరు సంఖ్య నుంచి రానున్న ఐదు సంవత్సరాల కాలంలో 20 సంఖ్యకి పెరగనుంది. అంతేకాదు 150 జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేసే దిశగా కార్యకలాపాలు సాగుతున్నాయి.

అలాగే కేంద్రం ఏడు నూతన ఐఐటిలు, ఒక ఎన్ఐటి, నాలుగు ఎన్ఐడిలను దేశంలో ఏర్పాటు చేయనుంది. ఏడు నూతన ఐఐఎంలను కూడా కేంద్రం తెరవనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునికత కాని రంగం మంటూ మనదేశంలో ఏదీ లేదు. ముందుగానే సునామీ హెచ్చరికలను తెలియజేయగలిగిన ప్రపంచ దేశాలలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. అంతేకాదు వాతావరణ పరిస్థితులను ముందొస్తుగా వెల్లడిచేసే కొద్ది దేశాలలో భారత్ కూడా ఉంది. ఇక అంతరిక్ష రంగాన్ని తీసుకుంటే 2022 నాటికి మ్యాన్డ్ స్పేస్‌క్రాఫ్ట్‌ ను భారత్ గగనతలంలోకి పంపనుంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ ప్రయోగాన్ని చేస్తున్న నాల్గవ దేశం భారత్. ప్రముఖ భారత అంతరిక్ష ఏజెన్సీ ఐఎస్ఆర్‌వొ (ఇస్రో) భవిష్యత్తులో తమ అంతరిక్ష స్టేషన్‌ను ఏర్పాటు చేసే పథకరచనలో ఉంది.

అంతే స్థాయిలో ఎనర్జీ రంగంలో పెట్టుబడులను బాగా పెట్టాలనే ఆలోచనల్లో కూడా భారత్ ఉంది. తద్వారా మౌలికసదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా మౌలికసదుపాయాల వనరులను ఆధునీకరించే లక్ష్యంతో ముందుకు వెడుతోంది. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ భారత రహదారులు, జలమార్గాలు, రైల్వేలను సైతం ఆధునీకరించాలనుకుంటున్నట్టు కూడా ప్రధాని స్పష్టంచేశారు. అంతేకాదు విమానయానం, స్టార్టప్స్, నూతన ఆవిష్కరణల విషయంలో కూడా భారత్‌కు ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. నేటి ప్రపంచంలో ఆధునికమైన, అత్యంతవేగవంతమైన రవాణా వ్యవస్థ కనీస అవసరంగా అర్థంచేసుకోవాలి. అది లేనట్టయితే, సమయానికి డిమాండ్లను నెరవేర్చకపోతే, ఆర్థికంగా వైఫల్యాలను చవిచూడాల్సి వస్తుంది. లేదా నిరుపయోగంగా, నష్టాల అంచుల్లో నిలబడిపోతాం.

2024 సంవత్సరానికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోని అతి శక్తివంతమైన ఆర్థికవ్యవస్థలు ఉన్న దేశాలలో ఆరవ స్థానంలో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న 2.8 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కూడా అతి వేగంగా పుంజుకున్నదే. 2024 సంవత్సరం నాటికి పెట్టుకున్న ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ తన పెరుగుదలను ప్రస్తుతం ఉన్న 6.7 శాతం నుంచి 10-11 శాతానికి రానున్న ఐదు సంవత్సరాల కాలంలో అంటే 2024 నాటికి పెంచాలి. ఈ టార్గెట్‌ను సాధించే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కానీ వాటిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనగలదు.

మహాత్మా గాంధీ 150వ జయంతి, భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంతో ఈ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలు భారత్ నిర్మాణంలో పాలు పంచుకోవాలనీ, స్వాతంత్ర సమర యోధుల స్వప్నాలను సాకారం చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం జీవించాలని పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. తాము తీసుకున్న నిర్ణయాలు రైతులు, వ్యాపారులు, యువతతోపాటు సమాజంలోని వివిధ వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో కృషి సల్పుతోందని ఆయన వివరించారు.

దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, అందుకే ప్రతి ఒక్కరు నీటిని పొదుపు చేయాలని, జల సంరక్షణను చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. 'జల శక్తి మంత్రిత్వ శాఖ'ను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని ప్రతి ఇంటికి నీరు అందించాలన్న దానిపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో స్పష్టం అవుతోంది. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ రాజకీయ పార్టీలన్నీ 2022 నాటికి 'నవ భారత్' రూపుదిద్దుకునే స్వప్నానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

రచన: శంకర్ కుమార్, జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన