పర్షియన్ గల్ఫ్‌ లో అదనపు సైనిక బలగాల మోహరింపు

గత వారంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో రెండు చమురు ట్యాంకర్ల మీద దాడులు జరిగాయి. ఈ దాడులకు ప్రతిగా పర్షియన్ గల్ఫ్‌లో భద్రతను పెంచేందుకు అదనంగా వెయ్యిమంది సైనిక బలగాలను దించనున్నట్టు అమెరికా రక్షణ విభాగం ప్రకటించింది. గత ఏడాది మేలో ఇరాన్ అణు ఒప్పందం (జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సిపిఒఎ) నుంచి అమెరికా వైదొలగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తలు ఎక్కువయ్యాయి. అమెరికా మళ్లా ఆర్థిక ఆంక్షలను ఇరాన్ మీద విధించింది. గత నెలలో ఇరాన్ చమురు దిగుమతులన్నింటినీ ఎత్తివేయడం జరిగింది. దాంతోపాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షలను విధించాలని నిర్ణయించుకున్నారు. రెండవసారి విధించే ఆంక్షలు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఇరాన్ పారిశ్రామికవేత్తలతో చేసే వాణిజ్యలావాదేవీలకు వర్తించనుంది. 

జెసిపిఒఎలోని ఒప్పందంపై సంతకాలు చేసిన ఇతర దేశాలకు, ముఖ్యంగా యుకె, ఫ్రాన్స్, జర్మనీలకు కూడా ఇరాన్ హెచ్చరికతో స్పందించింది. ఆంక్షల ప్రభావం నుంచి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు టెహ్రాన్ కూడా ఒప్పందం నుంచి తప్పనిసరిగా వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తనున్నాయంటూ హెచ్చరించింది. దీంతో అమెరికా పర్షియన్ గల్ఫ్‌ కు అదనంగా సైనికుబలగాలను పంపించేలా నిర్ణయం తీసుకుంది. సైనిక బలగాలతో పాటు అర్లింగ్టన్, పేట్రియాట్ క్షిపణి బ్యాటరీలను సైతం అమెరికా పంపిస్తోంది. 1500 మంది అదనపు సైనిక బలగాలను గల్ఫ్‌ కు పంపింది. సైనికబలగాల సమీకరణ, క్షిపణి బ్యాటరీలు పంపడం, అంతేకాదు నిఘా ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా ఆ ప్రాంతంలోకి పంపించడం వంటి అమెరికా చర్యలు ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగిస్తాయి. 

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు ట్యాంకులపై జరిగిన దాడిలో తమ పాత్ర ఏమీ లేదని ఇరాన్ నొక్కి చెబుతూ వస్తోంది. కానీ అమెరికా, సౌదీ అరేబియాలు రెచ్చగొట్టే ఈ చర్యకు కారణం ఇరానే అంటూ ఆరోపిస్తున్నాయి. అంతేకాదు మేలో ఫుజైరహ తీర ప్రాంతంలో నాలుగు చమురు ట్యాంకర్లపై జరిగిన దాడికి కూడా ఇరానే కారణమని అమెరికా, సౌదీ అరేబియాలు ఆరోపిస్తున్నాయి. సౌదీ అరేబియాపై యెమెన్‌లోని హోథి తిరుగుబాటుదారులు దాడులకు పూనుకున్నారు. ఒమెన్‌కి వ్యతిరేకంగా సౌది నాయకత్వంలోని సంకీర్ణ కూటమి సుదీర్ఘకాలంగా పోరాడుతోంది. 

ఈ ఏడాది మేలో సౌదీలోని ఆరామ్కో చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ దాడి జరిగింది. గత వారం దక్షిణ నజ్రాన్ ప్రావిన్స్ లోని అభా విమానాశ్రయం దగ్గర హోథి క్షిపణి దాడి జరిగింది. ఆ దాడిలో 26 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.హోథీ తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందించడంతోపాటు వారిని సౌదీలో దాడులకు ఇరాన్ పురిగొల్పుతోందని సౌదీ అరేబియా నిందించింది. ఈ సంఘటనల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్‌ లో అదనపు సైనిక బలగాలను అమెరికా మోహరించడాన్ని చూడాలి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోకి అదనపు సైనిక బలగాలను పంపుతున్నానంటూ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ అమెరికా ప్రస్తుత రక్షణ మంత్రి పాట్రిక్ షనాహన్ ‘ఇరాన్ శత్రుత్వవైఖరే ఇందుకు కారణమం’టూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇరాన్‌తో అమెరికా సంఘర్షణ కోరుకోవడం లేదని కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. ‘కేవలం తమ సైనిక సిబ్బంది రక్షణ, సంక్షేమం దృష్టిలోంచి’, అలాగే ‘తమ దేశ ప్రయోజనాల రక్షణ గురించి’ మాత్రమే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పాట్రిక్ వ్యాఖ్యానించారు. 

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న సమయంలో ఈ కీలక పరిణామాలు సంభవించాయి. ఇతర గ్లోబల్ శక్తులైన రష్యా, చైనా, ఫ్రాన్స్, యుకె, జర్మనీ దేశాలు ఉద్రిక్తలను తగ్గించగలమనే ఆశాభావంతో ఉన్నాయి. కానీ ఉద్రిక్తలను తగ్గించే దిశగా కీలకమైన, సుస్థిరమైన కార్యక్రమాన్ని చేపట్టడంలో విఫలమయ్యాయి. ఈ నెలలో జపాన్ ప్రధాని షింజో అబె ఇరాన్‌లో పర్యటించారు. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చేసిన ప్రయత్నాలలో ఆయన పర్యటన ఒకటి. ఇరాన్ తన వైఖరిని వదులుకోవాలంటూ అవి సర్ది చెప్పడానికి ప్రయత్నించాయి. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు నిర్మాణాత్మక పాత్ర పోషించాలంటూ ఇరాన్‌ని ఒప్పించే ప్రయత్నాలు జరిగాయి. 

కానీ ఇరాన్ ధిక్కార వైఖరినే అనుసరించింది. సైనిక చర్యల హెచ్చరికలకు తలొగ్గడానికి తిరస్కరించింది. తమను తాము కాపాడుకునే శక్తిసామర్థ్యాలు ఇరాన్‌కు ఉన్నాయని, ఎలాంటి సైనిక చర్యలనైనా ఎదుర్కొంటామని స్పష్టంచేసింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా చేపడుతున్న చర్యల పట్ల రష్యా, చైనాలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. విమర్శనాత్మక వైఖరిని అనుసరిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ పూర్తిగా ఒంటరి అయిపోలేదనే అంశం స్పష్టం అవుతుంది. పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పూనుకుంటే అది ప్రాంతీయంగా అతిపెద్ద సంఘర్షణ రూపంగా తలెత్తగలదని స్పష్టమవుతోంది. అమెరికాకు చెందిన డ్రౌన్‌ని ఇరాన్ కూల్చివేసినట్టు వార్తలు సూచిస్తున్నాయి. దీనిని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా పెద్ద పొరపాటుగా అభివర్ణించారు. ఈ చర్య ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తపరిస్థితులను రేపుతుంది.

భారత విషయానికి వస్తే, పర్షియన్ గల్ఫ్‌ లో చెలరేగుతున్న ఉద్రిక్తతలు మనదేశాన్ని ఎంతో ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను ఇక్కడ భారత్ కోరుకుంటోంది. ఇది భారత్‌కు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఎనర్జీ భద్రత పరంగా భరోసా ఏర్పడుతుంది. అంతేకాదు భారత దేశానికి చెందిన 8.5 మిలియన్ల పౌరులు గల్ఫ్‌ లో జీవిస్తున్నారు. ఇక్కడి ప్రాంతీయ దేశాలన్నింటితో భారత్‌కు బలమైన వ్యూహాత్మక, రాజకీయ, వాణిజ్యపర సంబంధాలు ఉన్నాయి. ఇరాన్, సౌదీ అరేబియాలు రెండింటితో భారత్‌కు దృఢమైన సంబందాలు ఉన్నాయి. ఇటీవల ఈ రెండు దేశాలు కూడా తమ ప్రతినిధులను భారతదేశానికి పంపడాన్ని ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సమస్యలో చిక్కుకున్న దేశాలు శత్రుత్వాలు సమసిపోవడానికి పటిష్టమైన కార్యక్రమాన్ని శోధించి దానిని అనుసరిస్తాయని భారత్ ఆశపడుతోంది. సమస్య పరిష్కార దిశగా అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయని భావిస్తోంది.


రచన: డా. మొహమ్మద్ ముద్దాస్సిర్ ఖామర్, పశ్చిమాసియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన