అసమ్మతి గళాలను అణిచివేస్తున్న పాకిస్తాన్

పాకిస్తాన్‌ రాజకీయ తిరుగుబాటు పరిస్థితుల మధ్య చిక్కుకుని ఉంది. అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్‌సాఫ్ (పిటిఐ) ప్రభుత్వ వ్యతిరేక గళాలకు ముక్కుతాడు వేస్తుండడమే ఇందుకు కారణం. ప్రతిపక్ష పార్టీ నాయకులైన పీపుల్స్ పార్టీకి చెందిన అసిఫ్ ఆలి జర్దారీ, పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్‌కు చెందిన హమజ్ షహ్‌బాజ్‌ల గళాలను అణగదొక్కడంతో పాటు పష్తూన్ తహఫజ్ మూవ్‌మెంట్ (పిటిఎం) వంటి గ్రూపులను విచ్ఛేదం చేయడం వంటి చర్యలతో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిరసన గళాలను అణిచివేస్తోంది. ముత్తాహిదా క్వామి మూవ్‌మెంట్‌కు (ఎంక్యూఎం) చెందిన నిర్వాసిత నాయకుడు అల్తాఫ్ హుస్సేన్‌ని బ్రిటిష్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక కూడా పాకిస్తాన్ హస్తం ఉంది. పాక్ సైన్యం చెప్పిన విధంగా ఏ దిశ నుంచి విమర్శలు వెల్లువెత్తినా వారిపై పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రతిపక్షాల గళాలపై ఉక్కుపాదం పెట్టడం, అసమ్మతిని అణచివేయడం వంటి పాక్ ప్రభుత్వ చర్యలు దానినే తిరిగి కొట్టే ప్రమాదం ఉంది.


నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) మాటున ప్రతిపక్ష నాయకులను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేయడం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో పాక్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా చేపట్టిన చర్య. ఈ చర్యలతో ప్రతిపక్షాల దృష్టి మరలించి ప్రభుత్వ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే తంతు పూర్తిచేసేద్దామని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని ప్రభుత్వం భావించినట్టు కనిపిస్తోంది. పాక్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ప్రస్తుతం ఎన్ఎబి తన దృష్టిని మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి, నీరు, విద్యుత్ విభాగానికి చెందిన మాజీ మంత్రి ఖవాజా మొహమ్మద్ అసిఫ్‌ల మీద కేంద్రీకరించింది. వీరిరువురు పిఎంఎల్-ఎన్‌లో ప్రముఖ నాయకులు. పిపిపి నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ, పిఎంఎల్-ఎన్‌కు చెందిన మరియం నవాజ్ షరీఫ్‌లు రెండు పర్యాయాలు ప్రభుత్వ చర్యలపై చర్చించారు. అంతేకాదు ఇరువురూ పాక్ బడ్జెట్‌ను ప్రజావ్యతిరేక బడ్జెట్‌గా, ఐఎంఎఫ్ మార్గదర్శకత్వంలో రూపొందించిన ఆర్థిక ముసాయిదాగా అభివర్ణించారు. 


ఈ రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులకు వ్యతిరేకంగా ఎన్ఎబి పరిశోధనలు చేపట్టిన సమయంలో వీరి సమావేశాలు జరిగాయి. రెండు పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులు పిపిపి కో-ఛైర్మన్ అసిఫ్ ఆలి జర్దారి, ఆయన సోదరి శర్యాల్ తల్పూర్‌లను, అలాగే పిఎంఎల్-ఎన్‌కు చెందిన పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు హమ్‌జా షాబాజ్‌లను అరెస్టు చేసిన నేపథ్యంలో కూడా ఈ సమావేశాలు జరిగాయి. పిటిఐ ఈ రెండు పార్టీల సమావేశాలను ‘మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్’గా అభివర్ణించింది. కానీ, ఈ రెండు పార్టీలు ప్రతిపక్షపార్టీలన్నింటినీ ఐక్యం చేసి వ్యతిరేక ప్రదర్శనలను చేపట్టిన పక్షంలో ఖాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న రాజకీయ సమస్యలు మరింత క్లిష్టతరమవుతాయి. ఈ అరెస్టులను ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశంతో చేపట్టినవిగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. తన వ్యతిరేకుల గళాలను మూయించడానికి అవినీతిని ఇమ్రాన్ ఖాన్ ఆయుధంగా మలచుకున్నారని వ్యాఖ్యానించాయి. అదే సమయంలో పిటిఎం వంటి గ్రూపులు శత్రు వర్గాలకు ఏజెంట్లని వ్యాఖ్యానించాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ నాయకులు మొహ్‌సిన్ దవార్, ఆలి వజీర్‌లను అరెస్టు చేయడాన్ని ఖండించారు. 


పిటిఎం నాయకుల అరెస్టు అనంతరం ఉత్తర వజిరిస్తాన్‌లోని ఒక నిరసన ప్రదర్శనలో పిటిఎం కార్యకర్తలను సైన్యం చంపింది. ఈ ప్రాంతం మొత్తం పాక్ సైన్యం నియంత్రణలో ఉంది. పిటిఎం నాయకుడు జూన్ పష్తీన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘స్థానికులను యుద్ధ ఖైదీలుగా చూస్తున్నారని, తుపాకీ చేతపట్టుకుని మాత్రమే ప్రజలు టౌన్లలో తిరగగలుగుతున్నార’ని అన్నారు. 


సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా ఆపేశారని కార్యకర్తలు ఎలుగెత్తి చాటారు. పాక్ సైన్యానికి ఈ హింసాత్మక సంఘటనలతో సంబంధం లేదని, దీనికి కారణం అరెస్టు అయిన పిటిఎం సభ్యులని చెబితేనే నిధులను మంజూరు చేస్తామని బాధిత కుటుంబాలతో సైన్యం చెప్పినట్టు తెలుస్తోంది. 


ఇటీవల పిటిఎంకు చెందిన మహిళానాయకురాలు గులాలై ఇస్మాయిల్‌ని పెషావర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేయడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. గులాలైకి వ్యతిరేకంగా ఉగ్రవాద చట్టం కింద రెండు కేసులను సైతం నమోదుచేశారు. గతంలో కూడా వివిధ ఆరోపణలతో గులాలై ఇస్మాయిల్ పేరును బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఈ ఘటన పాకిస్తాన్ ప్రభుత్వం పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను స్పష్టంగా అద్దంపడుతోంది. పష్తూన్ మారణకాండను కప్పిపుచ్చుకోవడానికి పాక్ ప్రభుత్వం ప్రయత్నించింది. అంతేకాదు దేశంలోని పౌర హక్కుల ఉద్యమాన్ని పాక్ ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. 


ఖాకన్ అబ్బాసిపై వచ్చిన ఆరోపణలపై విచారణను ఎన్ఎబి వేగవంతం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పిటిఎం నాయకుడికి ప్రభుత్వ వ్యతిరేక చర్యలను రెచ్చగొట్టేందుకు గాను బయట నుంచి నిధులు వస్తున్నాయంటూ చేసిన ఆరోపణలను నిరూపించే ప్రయత్నాలను ఎన్ఎబి వేగవంతం చేసింది. 


పష్తూన్ నాయకత్వాన్ని ఈ ఆరోపణల ప్రాతిపదికగా సభ్యత్వం నుంచి తొలగించాలని పిటిఐ ప్రయత్నిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు మరియం నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో-జర్దారీలు ఒకటి కావడం, ‘చార్టర్ ఆఫ్ డెమొక్రసీ’ ముసాయుదా పత్రంపై సంతకాలు చేయడం పాకిస్తాన్ సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తులోంచి చూస్తే కీలకమైందని చెప్పాలి. అందులోనూ పాక్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపై నడుస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నించడం మరింత ముఖ్యమైన పరిణామం.


రచన: డా. జైనాబ్ అఖ్తర్, పాకిస్తాన్ వ్యవహారాల విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన