వృద్ధి దిశగా ఇండియా-కిర్గిజ్‌స్తాన్ సంబంధాలు

భారత నూతన ప్రధానిగా రెండవసారి ఎంపికైన నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి కిర్గిజ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ సూరన్‌బే షరిపోవిచ్ జీన్‌బెకోవ్ హాజరయ్యారు. ఈ ప్రమాణస్వీకారోత్సవం మే30వ తేదీ న్యూఢిల్లీలో జరిగింది. ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించిన ప్రపంచదేశాల నాయకుల్లో జీన్‌బెకోవ్ కూడా ఉన్నారు. బిఐఎంఎస్‌టిఇసి దేశాలను నాయకులను కూడా ఈ సందర్భంగా భారత్ ఆహ్వానించింది. మారిషస్ ప్రధాని కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ) ప్రస్తుత ఛెయిర్‌గా కిర్గిజ్ రిపబ్లిక్ ఉంది. మధ్య ఆసియాలో భారత కీలక భాగస్వామి ఈ దేశం. ఆ దేశ ప్రెసిడెంట్ జీన్‌బెకోవ్ భారత ప్రధాని నరేంద్రమోదీకి తన హృదయపూర్వక అభినందనలను తెలిపారు. ఎస్‌సివొ శిఖరాగ్ర సభకు, అలాగే జూన్ 13-15 వరకూ ద్వైపాక్షిక పర్యటనకు రావాల్సిందిగా జీన్‌బెకోవ్ ప్రధాని నరేంద్రమోదీని పునర్ ఆహ్వానించారు.

భారత, కిర్గిజ్ రిపబ్లిక్‌ల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహ సంబంధాలను ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టపడడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చినందుకు మోదీ తన హృదయపూర్వక కృతజ్ఘతలను జీన్‌బెకోవ్‌కు తెలిపారు. కిర్గిజ్ రిపబ్లిక్‌లో పర్యటించవలసిందిగా జీన్‌బెకోవ్ ఆహ్వానించడం పట్ల తన కృతజ్గతలను తెలియచేశారు. కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన పట్ల తనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

చారిత్రకంగా గమనిస్తే భారత్‌కి మధ్యఆసియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా పురాతన సిల్క్ రూట్‌లోని కిర్గిజ్ రిపబ్లిక్‌తో పాటు ఇతర దేశాలతో కూడా భారత్‌కు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రష్యా శకం ఉన్నప్పుడు, భారత్, కిర్గిజ్ రిపబ్లిక్‌ల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఎంతో పరిమితంగా ఉండేవి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1985లో బిష్‌కెక్, ఇసిక్-కుల్ లేక్‌లలో పర్యటించారు. 1991, ఆగస్టు 31న కిర్గిజిస్తాన్‌కి స్వతంత్రం వచ్చి రిపబ్లిక్‌గా ఏర్పడింది. ఆ తర్వాత 1992, మార్చి 18 నాటి నుంచి ఆ దేశం దౌత్య సంబంధాలు పెట్టుకున్నతొట్టతొలి దేశాలలో భారత్ కూడా ఉంది. ది రెసిడెంట్ మిషన్ ఆఫ్ ఇండియా 1994, మే 23న స్థాపించారు.

కిర్గిజ్ రిపబ్లిక్‌తో రాజకీయ సంబంధాలు స్నేహవాతావరణంలోనే కొనసాగుతూ వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో శాశ్వతసభ్య దేశంగా భారత్‌కు కిర్గిజ్ రిపబ్లిక్ మద్దతు ఇస్తోంది కూడా. అలాగే షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ)లో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వాలని బిష్‌కెక్ మద్దతు ఇస్తోంది. పొంచి ఉన్న ఉగ్రవాదం, తీవ్రవాదం, డ్రగ్-ట్రాఫికింగ్ వంటి సమస్యలను ఇరుదేశాలు ఎదుర్కొంటున్నాయి. 1992లో దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుంచి రెండు దేశాలు పలు ప్రాజక్టు నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇవి సంతకాలు చేసిన ఒప్పందాలలో సాంస్కృతిక రంగం, వాణిజ్యం, ఆర్థిక సహకారం, పౌరవిమానయాన రంగం, పెట్టుబడులు పెంపుదల మరియు పరిరక్షణ, రెట్టింపు పన్నుల విధానం లేకుండా ఉండడం, కాంస్యులర్ కన్వెన్షన్ వంటి అంశాలు ఉన్నాయి.

మాజీ విదేశాంగ వ్యవహారాల సహాయమంత్రి 2012 జూన్‌ 10-13 తేదీ వరకూ కిర్గిజ్ రిపబ్లిక్‌లో చేసిన పర్యటనలో కనెక్ట్ సెంట్రల్ ఆసియా పాలసీని భారత్ ప్రకటించింది. అలాగే తొలి ఇండియా-సెంట్రల్ ఆసియా ట్రాక్-2 డయలాగ్ బిష్‌కెక్‌లో అప్పుడే జరిగింది . మధ్య ఆసియాలో ఇ-నెట్‌వర్కును భారత్ స్థాపించింది. తద్వారా టెలి-మెడిసెన్, టెలి-ఎడ్యేకేషన్లను పెంపొందించాలని మనదేశం లక్ష్యంగా పెట్టుకుంది.

అప్పటి భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్‌సివొ సమావేశంలో పాల్గొనేందుకు 2013, సెప్టెంబరులో కిర్గిజ్ రిపబ్లిక్‌కు వెళ్లారు. ఈ శిఖరాగ్ర సదస్సు సమయంలో ప్రత్యేకంగా భారత విదేశాంగ మంత్రి ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రోహానితో ద్వైపాక్షిక అంశాలపై సమావేశమయ్యారు. అలాగే మంగోలియన్ ప్రెసిడెంట్ ఎల్బెగ్‌డోర్గ్‌తో, ఎస్‌సివొ సెక్రటరీ జనరల్ మజెంత్‌సేవ్‌లతో కూడా ప్రత్యేకంగా ద్వైపాక్షిక అంశాలపై మంత్రి సమావేశమయ్యారు.

2015, జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజ్ రిపబ్లిక్‌లో పర్యటించారు. 20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత దేశానికి చెందిన ప్రధాని ఆ దేశంలో పర్యటించడం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ అప్పటి కిర్గిజ్ ప్రెసిడెంట్ అల్మాజ్‌బెక్ అతమ్‌బయేవ్, స్పీకర్ అసైల్‌బెక్, ఆ దేశ ప్రధాని తెమిర్ సరియేవ్‌లతో సమావేశమయి పలు అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ విక్టరీ స్క్వేర్ ప్రారంభించారు. అంతేకాదు ఫీల్డ్ ఆసుపత్రికి వైద్య సామగ్రిని బహుమతిగా అందజేశారు. అంతేకాదు అక్కడి కిర్గిజ్-ఇండియా మౌంటెన్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించారు. కిర్గిజ్ రిపబ్లిక్ లోని ఆసుపత్రులను భారతదేశంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో అనుసంధించి టెలి-మెడిసెన్ లింక్స్ ప్రారంభించారు. అంతేకాదు మహాత్మాగాంధీ విగ్రహాన్ని స్థాపించారు. రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి, అలాగే సంస్కృతి, ఎన్నికలు, స్టాండర్డైజేషన్ వంటి పరస్పర ఒప్పందాలపై ఈ రెండు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని, కిర్గిజ్ ప్రెసిడెంట్‌లు ఇరువురూ కలిసి ఒక సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేశారు. అప్పటి కిర్గిజ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ అల్మాజ్‌బెక్ అతామ్బావ్ 2016 డిశెంబరులో భారతదేశంలో పర్యటించారు.

భారత-కిర్గిజ్ రిపబ్లిక్‌ల మధ్య 2016-2017 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం 24.98 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. కిర్గిజ్ రిపబ్లిక్‌కు భారత్ ఎగుమతులు చూస్తే 22.66 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. అదే సమయంలో కిర్గిజిస్తాన్ భారతదేశానికి చేసే ఎగుమతుల విలువ 2.32 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. దుస్తులు, చర్మ ఉత్పత్తులు, డ్రగ్స్, మందులు, పరిశుద్ధమైన రసాయనాలు, టీ వంటి కొన్ని ముఖ్యమైన ఉత్పత్తులు కిర్గిజ్ రిపబ్లిక్‌కు భారత్ చేసే ఎగుమతుల్లో ఉన్నాయి. కిర్గిజ్ రిపబ్లిక్ భారత్‌కు ఎగుమతి చేసే వాటిలో ముడి పదార్థాలు, మెటాలిఫెర్స్, మెటల్ స్క్రాప్, లోహాలు వంటివి ఉన్నాయి.

ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ (ఐటిఇసి) కార్యక్రమం కింద సాంకేతిక సహాయం మరీ ముఖ్యంగా మానవవనరుల అభివృద్ధికి భారత్ ఆర్థికంగా కిర్గిజ్ రిపబ్లిక్‌తో పాలుపంచుకోవడం చాలా ముఖ్యమైన అంశం.

కిర్గిజ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ జీన్‌బెకోవ్ న్యూఢిల్లీ పర్యటన, అలాగే బిష్‌కెక్‌కు భారత ప్రధాని పర్యటించాలన్న నిర్ణయం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెడతాయి.

రచన: పదం సింగ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం