ఐదవ సికా శిఖరాగ్ర సదస్సు, ఇండియా
గత వారాంతంలో ఐదవ ‘కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ ఇన్ ఆసియా’ సికా (సిఐసిఎ) సదస్సు తజకస్తాన్‌లో జరిగింది. కజకిస్తాన్ తొలి ప్రెసిడెంట్ నూర్‌సుల్తాన్ నజర్‌బేవ్ సికా వ్యవస్థాపక సభ్యులు. నూర్‌సుల్తాన్ తన ఈ ఆలోచనను 1992లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో చేసిన ప్రసంగంలో ప్రతిపాదించారు. సికా సెక్రటేరియట్ 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది ఆస్తానాలో ఉంది. ప్రస్తుతం దీనిని నూర్‌సుల్తాన్ అంటారు. ఇది ఇప్పుడు కజకస్తాన్ రాజధాని. 30 వరకూ ఆసియా దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. అంతేకాదు ఈ వేదికలో ఎన్నో అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ కజకిస్తాన్, టర్కీ, చైనా, తజకస్తాన్‌లు సికాకు ఛైర్మన్‌షిప్ బాధ్యత నిర్వహించాయి.
తొలి సికా శిఖరాగ్రసదస్సు 2002 లో కజకస్తాన్‌లోని ఆల్మాటిలో జరిగింది. ఇక్కడే దాని చార్టర్‌ని చేపట్టారు. ఈ చార్టర్‌నే ఆల్మాటీ యాక్ట్ అంటారు. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయి ఈ శిఖరాగ్రసదస్సులో పాల్గొన్నారు. భారత పెట్రోలియం, సహజవాయువుల మంత్రి 2006లో ఆల్మాటీలో జరిగిన రెండవ శిఖరాగ్రసదస్సుకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు. మాజీ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి 2010, జూన్‌లో ఇస్తాంబుల్‌లో జరిగిన సికా సదస్సుకు భారత ప్రధాని ప్రత్యేక ప్రతినిధిగా హాజరయ్యారు. 2014, మే లో నాల్గవ సికా శిఖరాగ్ర సదస్సు చైనాలోని షాంఘైలో జరిగింది. ఆ ఏడాది భారత పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఈ సదస్సును నిర్వహించారు. అప్పుడు ఆ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ సీనియర్ సభ్యులు హాజరయ్యారు.
ఆసియాకు చెందిన సికా వేదిక ప్రధాన లక్ష్యం సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంచాలన్నదే. అలాగే సుస్థిరత, భద్రత, శాంతియుత పరిస్థితులు ఖండమంతానే కాదు ప్రపంచమంతా విస్తరించాలన్నది సికా ఉద్దేశం. ఐక్య ఆసియా నిర్మాణానికి దశల వారీగా ప్రయత్నించాలని దీని లక్ష్యం. అలా సంఘటిత రక్షణ దిశగా కృషిచేయాలని భావించింది. ఈ దిశగా ప్రయాణం సాగించేందుకు సికా ‘కాటలాగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్’ ని చేపట్టింది. ఈ ఆత్మవిశ్వాస పెంపుదల బృహత్‌కార్యాన్ని ముఖ్యంగా ఐదు విస్తృత కేటగిరీలుగా విభజించింది. అవి కొత్త సవాళ్లను, ప్రమాదాలను ఎదుర్కోవడం, ఆర్థికరంగ వృద్ధి, పర్యావరణం, మానవాళి నివాసాలు, సైనిక-రాజకీయ కోణాలపై పనిచేస్తాయి. ఆత్మవిశ్వాస పెరుగుదల దిశగా చేపట్టే చర్యలు, రవాణా, విద్యుత్ భద్రత వంటి రంగాలకు కో-కోఆర్డినేటర్‌గా భారత్ వ్యవహరిస్తోంది.
ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి సికా శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తారు. తజకస్తాన్‌లో జరిగిన ఐదవ సికా శిఖరాగ్ర సదస్సు ‘షేర్డ్ విజన్ ఫర్ ఎ సెక్యూర్ అండ్ మోర్ ప్రాస్పరస్ సికా రీజియన్’ అనే అంశంపై జరిగింది. భారతదేశం తరపున కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డా. సుబ్రమణియం జైశంకర్ హాజరయ్యారు. ఇటీవల భారత్‌లో ఏర్పడ్డ మోదీ ప్రభుత్వంలో కొత్తగా విదేశీవ్యవహారాల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జైశంకర్‌కు మధ్య ఆసియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
సికా చేపట్టిన పలు కార్యకలాపాల్లో భారత్ ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకుంటోంది. సికా దశల వారీగా వృద్ధి చెందాలని న్యూఢిల్లీ భావిస్తోంది. అలా ఆసియా వాస్తవ పరిస్థితులను, దాని అవసరాలను గుర్తించే రీతిలో సికా పయనం సాగాలని భారత్ అభిప్రాయపడుతోంది. ఐదవ సికా శిఖరాగ్రసదస్సును ఉద్దేశించి భారత విదేశాంగ శాఖా మంత్రి డా. జైశంకర్ మాట్లాడుతూ 21 వ శతాబ్దం ఆసియా శతాబ్దం కావాలని, ఇందులో సికా నిర్మాణాత్మక పాత్ర వహించి శాంతి, భద్రతలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ రోజు ఆసియా ఖండం ఉగ్రవాదమనే పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఉగ్రవాదులను, ఉగ్రవాద బాధితులను ఒక తాటన కట్టద్దన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో తలెత్తిన నూతన పరిణామాలపై ప్రతిస్పందిస్తూ ఆఫ్ఘన్ సారథ్యంలోని, ఆఫ్ఘన్‌కి సంబంధించిన జాతీయ శాంతి, సయోధ్య ప్రక్రియలకు భారత మద్దతు ఎప్పుడూ ఉంటుందని జయశంకర్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
ఎనర్జీ భద్రతా లోపం అతి పెద్ద అభివృద్ధి పరమైన సవాలుగా నిలిచిందని భారత మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్య సంభాషణలు సుస్థిర ఎనర్జీ మార్కెట్‌ను సృష్టించడానికి తోడ్పడతాయని అన్నారు. ఆసియా ప్రపంచంలోని అత్యున్నత ఎనర్జీ ఉత్పత్తిదారులకు నిలయమనే సంగతి ఈ సందర్భంగా మరవరాదు. అలాగే ఆసియాలో వినియోగదారులు కూడా అధికమే. భారతదేశం పునరుత్పత్తి ఇంధన రంగంలో తన వంతు కృషిని కొనసాగిస్తోందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇప్పటి వరకూ అంతర్జాతీయ సోలార్ సంకీర్ణకూటమి (ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్, ఐఎస్ఎ)లో చేరని సికా సభ్యదేశాలను అందులోకి చేరాలంటూ కోరారు. ఐఎస్ఎ ప్రధానకార్యాలయం ఢిల్లీ సమీపంలోని గురుగావ్‌లో ఉంది.
సికా ఐదవ శిఖరాగ్ర సదస్సు సంయుక్త ప్రకటనను చేపట్టింది. అందులో ఉగ్రవాదం లాంటి పలు అంశాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేయడాన్ని కూడా పేర్కొన్నారు. ఈ సమిష్టి ప్రకటనలో భద్రతాపరమైన ప్రమాదాల పట్ల చాలా ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యంగా తీవ్రవాదం, ఉగ్రవాదాలు దేశ భద్రతకు అన్ని రకాలుగా, అన్ని రూపాలలో ప్రమాదకరంగా పరిణమిస్తాయని అందులో పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుకు సికా సభ్యదేశాలన్నీ ఒక సమగ్ర వ్యూహాన్ని చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఉగ్రవాదాన్ని పెంచే పరిస్థితులను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు ఉగ్రవాద చర్యలకోసం అంతర్జాలాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని, ఉగ్రవాదుల షెల్టర్లను ధ్వసం చేయాలని సికా ప్రకటన స్పష్టంచేసింది. అంతేకాదు వాణిజ్యం, వాణిజ్య పరిస్థితులను, రవాణాను పెంచేందుకు విస్తృతస్థాయిలో ఆర్థిక, సాంస్కృతిక సహకారంతో పాటుగా అనుసంధానంలో మెరుగుదల చేపట్టడం ద్వారా సుసాధ్యం చేయాలని సికా శిఖరాగ్ర సదస్సు కోరింది. ఆరవ సికా శిఖరాగ్ర సదస్సు 2022 సంవత్సరంలో జరుగుతుంది.
Comments
Post a Comment