భారత ప్రధాని కిర్గిజిస్తాన్ పర్యటన
భారత ప్రధానిగా రెండవ పర్యాయం అత్యధిక మెజారితో గెలిచి అధికార పగ్గాలను చేపట్టిన నరేంద్రమోదీ జూన్ 13-14 తేదీల్లో కిర్గిజిస్తాన్‌లోని బిష్‌కెక్‌లో పర్యటించారు. కిర్గిజిస్తాన్ ప్రెసిడెంట్ సూరోన్‌బే జీన్‌బెకోవ్‌ను కలిసి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాదు షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ) సదస్సుకు హాజరయ్యారు. కిర్గిజిస్తాన్ ప్రెసిడెంట్ జీన్‌బెకోవ్ ఎస్‌సివొ ప్రస్తుత ఛైయిర్‌గా వ్యవహరిస్తున్నారు.
కిర్గిజిస్తాన్ ప్రెసిడెంట్ జీన్‌బెకోవ్‌తో ప్రధాని మోదీ సమావేశం వ్యూహాత్మకమైందిగా అభివర్ణించాలి. పది రోజుల వ్యవధిలో భారత ప్రధాని, కిర్గిజ్ ప్రెసిడెంట్‌లు పున: సమావేశం అయ్యారు. కిర్గిజ్ ప్రెసిడెంట్ మే 30న జరిగిన భారత ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు కూడా.
ఎస్‌సివొ శిఖరాగ్ర సదస్సుకు బిష్‌కెక్ వెళ్లినపుడు ప్రధాని మోదీ, కిర్గిజిస్తాన్ ప్రెసిడెంట్ జీన్‌బెకోవ్ ఇరువురూ జూన్ 14 వ తేదీన జరిగిన తొలి ఇండియా-కిర్గిజ్ బిజినెస్ ఫోరమ్ సమావేశాన్ని గురించి ప్రస్తావించారు. ఈ సమావేశం ఎంతో విజయవంతమైందనే ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి.
మొత్తానికి భారత్, కిర్గిజిస్తాన్ దేశాలు రెండూ కలిసి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డిటిఎఎ)కు తుదిరూపం ఇవ్వగలిగాయి. అంతేకాదు ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని చేసుకోగలిగాయి. వీటి వల్ల ఇరుదేశాల మధ్య దైపాక్షిక వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం సాధ్యమవుతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగేలా ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఐదు సంవత్సరాలకు తగ్గట్టు రోడ్ మ్యాప్‌ను రూపొందించుకోవడానికి సహాయపడే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల మధ్య 2016-17 మధ్యలో వాణిజ్యం 24.98 మిలియన్ల అమెరిన్ డాలర్లు ఉంది. కిర్గిజిస్తాన్‌కు భారత ఎగుమతులు 22.66 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. మనదేశానికి కిర్గిజ్ ఎగుమతులు చూస్తే 2.32 మిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే ఉంది. దీన్ని బాగా పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని రెండు దేశాలూ గుర్తించాయి.
రెండు దేశాల నాయకులు ఎంతో ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ లోని ఛబాహర్ పోర్టు భారత, కిర్గిజిస్తాన్ల మధ్య వాణిజ్య సంబంధాలను పోర్టు ద్వారా అనుసంధానత పెంచి మరింత పెంపొందిస్తానని మాటిచ్చింది. అంతేకాదు ఈ ఒప్పందం రెండు దేశాలలో పెట్టుబడులు పెడుతున్న వారికి తగిన రక్షణ కల్పిస్తుంది.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇప్పటివరకూ స్పృశించని వివిధ రంగాలలో అవకాశాలను శోధించవలసిందిగా రెండు దేశాల వాణిజ్య సమూహాలను కోరారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెంపుదల, పురోగతి గురించి ప్రస్తావిస్తూ మూడు శక్తివంతమైన అంశాలను మోదీ ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలను పెంచడానికి ఈ మూడు అత్యావశ్యకం. అవేమిటంటే వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి అనుకూల వాతావరణం సృష్టించడం, అనుసంధానత, బిజినెస్ టు బిజినెస్ ఇచ్చిపుచ్చుకోవడాలు. ఇవి ఎంతో ప్రధానమైనవని మోదీ అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ కిర్గిజిస్తాన్‌లో ఏ ఏ రంగాలలో పెట్టుబడులు పెట్టగలదో పేర్కొన్నారు. ఉదాహరణకు ఆర్గానిక్ ఉత్పత్తులు, తేనె, వాల్‌నట్స్, పాల ఉత్పత్తులు, వస్త్రాలు, రైల్వేస్, జలవిద్యుత్శక్తి, మైనింగ్, ఖనిజాల అన్వేషణ వంటి వాటిల్లో భారత్ పెట్టుబడులు పెడుతుందని పేర్కొన్నారు.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మోదీ కిర్గిజ్ వాణిజ్య వర్గాలను కోరారు. భారత్ విస్తృతమవుతున్న మార్కెట్ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెట్టింపు పన్నులు ఉండవు. దానికితోడు వాణిజ్యానికి, పెట్టుబడులకు సరైన అనుసంధాన వసతులు భారత్‌లో ఉన్నాయన్నారు. వాణిజ్య అభివృద్ధికి అవకాశాలు మెండు అని, దీనివల్ల ప్రగతి దిశగా కంపెనీలు ముందుకు సాగుతాయని వ్యాఖ్యానించారు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న ఆత్మ విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా మోదీ వ్యక్తంచేశారు. భారత్‌లో ఆర్థికపరంగా, అలాగే అధునాతన సాంకేతిక రంగంలో అభివృద్ధి ద్వారా ప్రపంచం సుసంపన్నం కావడానికి భారత్ సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే కిర్గిజిస్తాన్‌లోని ఐదు సంవత్సరాల ప్రణాళిక భారత ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరువ కావడానికి తోడ్పడుతుంది. అంతేకాదు రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు, పెరుగుదలకు ఇది ఎంతో సహాయపడుతుంది కూడా.
ఐదు సెంట్రల్ ఆసియా దేశాలతో భారత్ సత్సంబంధాలను పంచుకుంటోంది. అందుకే ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా ఈ దేశాలను భారత అభివృద్ధిలో అంతర్భాగం చేయాలని కోరుకుంటోంది. మధ్య ఆసియా భారత్‌కు ఎంతో ముఖ్యమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘నమస్కార్ యురాసియా’ ట్రేడ్ ప్రదర్శన గురించి ప్రస్తావించారు. దీనిని ఈ ఏడాది బిష్‌కెక్‌లో నిర్వహించారు. ఈ వాణిజ్య ప్రదర్శన భారత్, మధ్య ఆసియాల మధ్య పరస్పర వాణిజ్య సమావేశాలను వృద్ధి చేస్తాయి. యురేషియన్ ఎకనామిక్ కూటమిలో కిర్గిజిస్తాన్‌తో కలిపి ఈ ఐదు దేశాల సభ్యత్వం కూడా భారత దేశానికి ఎంతో కీలకమైంది. ముఖ్యమైంది.
భారత్, కిర్గిజిస్తాన్‌లు కలిపి మొత్తం పదిహేను ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వాటిల్లో రక్షణ, వాణిజ్యం పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాలు కూడా ఉన్నాయి. అంతేకాదు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందంపై కూడా రెండు దేశాలూ సంతకాలు చేశాయి. భారత్ కిర్గిజిస్తాన్‌లో అభివృద్ధి ప్రాజక్టుల కోసం ఆ దేశానికి లైన్ ఆఫ్ క్రెడిట్ 200 మిలియన్ అమెరికన్ డాలర్లను భారత్ ప్రకటించింది కూడా. 2021 సంవత్సరాన్ని ఇరుదేశాల సాంస్కృతిక, స్నేహసంబంధాల సంవత్సరంగా సంబరాలు జరుపుకోవాలని రెండు దేశాలూ ఒక అంగీకారానికి వచ్చాయి.
అలా ప్రధాని నరేంద్రమోదీ కిర్గిజిస్తాన్ పర్యటన విజయవంతమైంది. ఫలవంతమైంది. సమావేశ సమయంలో తాము చేసుకున్న ఒప్పందాల నన్నింటినీ తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం రెండు దేశాలకూ ఎంతో ఉంది కూడా.
Comments
Post a Comment