ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో ఇండియా పాత్రను సూచిస్తున్న ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం
రెండవ పర్యాయం భారత ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారోత్సవం పెద్ద ఎత్తున జరిగింది. దీనికి ‘బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్స్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో-ఆప రేషన్’ (బిఐఎంఎస్‌టిఇసి), షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ) హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నాయకులు హాజరయ్యారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి వీరిని ఆహ్వానించడం వెనుక ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో అతి పెద్ద శక్తిగా కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంలో భారత్ ఉంది.
బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ కూడా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. భారత్‌తో ప్రస్తుతం తమకున్న ప్రత్యేక సంబంధాలను ప్రతిఫలించేలా పెద్ద ప్రతినిధి బృందంతో ఈ ఉత్సవానికి ఆయన హాజరయ్యారు. బిఐఎంఎస్‌టిఇసి సభ్యదేశాలు కూడా తమ దేశాలకు చెందిన అత్యున్నత నాయకులను ఈ ప్రమాణస్వీకారోత్సవానికి పంపాయి. ఈ సందర్భంగా భారత్ వచ్చిన పలువురు ప్రతినిధులు మోదీతో అనధికారికంగా చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రధాని మోదీ రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఈ సంబంధాలను మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కూడా సమావేశాలు దృష్టిపెట్టాయి.
నేపాల్, భూటాన్ దేశాల ప్రధానులు కెపి శర్మ ఓలి, లోతే షేరింగ్‌లు ప్రమాణస్వీకారో త్సవానికి హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. గత ఏడాది శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అలాగే ఈస్టర్ ఆదివారం నాడు శ్రీలంకలో భయంకరమైన ఉగ్రదాడులు జరిగాయి. వీటిపై న్యూఢిల్లీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేయడమే కాదు ఈ పరిణామాలపై దృష్టిసారించడం గుర్తుండే ఉంటుంది. ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనతో సమావేశమయ్యారు. వారి చర్చలు పలు అంశాలతో పాటు ఇరుదేశాల మధ్య భద్రతా భాగస్వామ్యంపై కూడా జరిగాయి. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన 2015లో ఆ దేశ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ చోటుచేసుకోవడం విశేషం. అంతేకాదు న్యూఢిల్లీకి తరచూ ఆయన వస్తుంటారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు వచ్చే జనవరి నెలలో జరగనున్నాయి. ఇకపోతే మయన్మార్ ప్రెసిడెంట్ విన్ మింట్ కూడా ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. అంతేకాదు ప్రధాని నరేంద్రమోదీతో అనధికార చర్చలు జరిపారు కూడా.
థాయ్‌లాండ్ ప్రధాని కూడా అదే రోజున పదవీస్వీకారం చేస్తుండడంతో తమ దేశం తరపున ప్రత్యేక ప్రతినిధిని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పంపారు. రానున్న నవంబరు మాసంలో జరగనున్న ఇండి-ఏసియన్ అండ్ ఏసియా శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే బిఐఎంఎస్‌టిఇసి కూడా మోదీ ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ప్రాంతం. కారణం సార్క్ కార్యక్రమాలు సాఫీగా, పటిష్టమైన రీతిలో జరగకుండా పాకిస్తాన్ అడ్డుకుంటున్ననేపథ్యంలో బిఐఎంఎస్‌టిఇసి భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారింది. గోవాలో 2016 అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ బిఐఎంఎస్‌టిఇసి ప్రతినిధులతో, ఆ దేశాలతోపాటు ‘బ్రిక్స్’ దేశాలతో అనధికారికంగా చర్చలు జరిపారు. 2017 సంవత్సరం నుంచి బిఐఎంఎస్‌టిఇసి జాతీయ భద్రతా సలహాదారులు (నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్) తరచూ సమావేశమవుతూ ఆ ప్రాంతంలోని పలు దేశాల మధ్య చోటుచేసుకుంటున్న నేరాలు, ఉగ్రవాద దాడులను నిర్మూలించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. బిఐఎంఎస్‌టిఇసి మోటార్ వెహికల్ ఒప్పందం దక్షిణ, ఆగ్నేయాసియాల మధ్య ప్రాంతీయ అనుసంధానంగా ఎంతో కీలకమైన పథకం.
సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఉగ్రదాడుల విషయంలో పాక్ వ్యతిరేక ధోరణి, అలాగే అనుసంధాన పథకం విషయంలో అనుకూలంగా అది స్పందించకపోవడం వంటి అంశాలలో సార్క్ శక్తివంతంగా వ్యవహరించపోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బిఐఎంఎస్‌టిఇసి సభ్యదేశాలతో స్నేహంగా ఉంటూ పటిష్ట సంబంధాలను వాటితో ఏర్పరచుకుంటోంది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా చైనా ఆ ప్రాంతంలోకి చొచ్చుకెడుతున్న సమయంలో భారత్ ఉనికి అక్కడ ఎంతో అవసరంగా భావించి బంగాళాఖాతం సమీప దేశాలతో, ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానానికి భారత్‌కు బిఐఎంఎస్‌టిఇసి ఒక అవకాశాన్ని అందిస్తోంది. ఈ ప్రాంతం భారత ప్రభావం ఉన్న ప్రాంతంగా గుర్తుకొస్తుంది. మలాక్కా స్ట్రైట్స్కి బంగాళాఖాతం పెద్ద లింకు ఉంది. ఇది చైనాకు అతిపెద్ద వాణిజ్య మార్గం కూడా. భారత్, భూటాన్లలో తప్పించి బిఐఎంఎస్‌టిఇసి లోని పలుదేశాల్లో చైనా పలు ప్రాజెక్టులను చేపట్టింది. బంగాళాఖాతం మార్గం ద్వారా 25 శాతం మేర గ్లోబల్ వాణిజ్యం జరుగుతోంది. అంతేకాదు ఎవ్వరూ స్పృశించని అపూర్వమైన వనరులు ముఖ్యంగా ఎనర్జీ రంగానికి సంబంధించి పెద్దఎత్తున సహజవాయు నిల్వలు బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నాయి. ఇది భవిష్యత్‌లో విద్యుత్ శక్తి పంపిణీకి నిలయంమని చెప్పాలి. బిఐఎంఎస్‌టిఇసి సభ్యదేశాలతో భారత్‌కు పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. దీంతో బంగాళాఖాత ప్రాంతంలో చైనా కన్నా భారత్‌కు అందే ప్రయోజనాలు, లాభాలు ఎక్కువగా ఉంటాయి.
షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ) ప్రస్తుత ఛెయిర్‌గా కర్జిస్తాన్ ఉంది. ఆ దేశ నాయకులును కూడా ప్రధాని ప్రమాణస్వీకాదోత్సవానికి భారత్ ఆహ్వానించింది. దీని వెనుక భారత్‌కు పెద్ద ఉద్దేశమే ఉంది. సెంట్రల్ ఆసియా, విస్తృతమైన యురేసియాలలో భారత ఉనికిని విస్తరించుకోవాలని భారత్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాంతంలోకి చైనా కూడా ప్రవేశించి తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలో భారత్ విస్తృత పాత్ర పోషించాలని సెంట్రల్ ఏసియన్ దేశాలు కోరుకుంటున్నాయి. దీనివల్ల మరిన్ని వ్యూహాత్మక అవకాశాలు తమకు అందుతాయని అవి భావిస్తున్నాయి. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ సెంట్రల్ ఆసియన్ నాయకులను ఈ నెల అనంతరం బిష్కెక్లో జరగనున్న ఎస్‌సివొ శిఖరాగ్ర సమావేశ సందర్భంగా కలిసి వారితో ప్రత్యేక చర్చలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
మారిషస్ ప్రధాని ప్రవింద్ జునాథ్ మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవడం ద్వారా మారిషస్ పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి ఎంతో సన్నిహితమైన భాగస్వామి అని చెప్పకనే చెప్పారు. అంతేకాదు ఈ ప్రాంతంలో భద్రతను అందించే పెద్ద శక్తిగా నిలవాలని న్యూఢిల్లీ కోరుకుంటోంది.దాంతో పాటు హిందూమహాసముద్ర వనరులను సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
Comments
Post a Comment