పారిస్‌లో జరగనున్న జి-7 శిఖరాగ్రసదస్సుకు భారత్‌కు ఆహ్వానం

భారత ప్రధాని నరేంద్ర మోదీ 45వ జి-7 శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సదస్సు దక్షిణ ఫ్రాన్సులోని బియారిట్జ్‌లో  ఈ ఏడాది ఆగస్టు 24-26 తేదీల్లో జరగనుంది. ఆస్ట్రేలియా, చిలి, దక్షిణాఫ్రికాలతో పాటు భారత్‌ను కూడా ఈ సదస్సుకు ‘ప్రత్యేక ఆహ్వానితులు’గా ఫ్రెంచి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానించారు. జి-7 లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకులు ఉన్నారు.  గ్లోబల్‌గా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ల మీద నిర్మొహమాటంగా, సూటిగా చర్చలను జి-7 సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తారు.

భారత్ ప్రధాన ఆర్థిక శక్తిగా, రాజకీయ శక్తిగా, అలాగే భారత, ఫ్రాన్సు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపచేయడంలో మనదేశం ప్రాధాన్యం సంతరించు కుందన్న విషయం కూడా ఈ సదస్సుకు  భారత్ ఆహ్వానం అందుకోవడం మరింత స్పష్టంచేస్తోంది. అంతేకాదు రెండు దేశాల మధ్య వ్యక్తిగతంగా పెరుగుతున్న సంబంధాలు, అలాగే భారత ప్రధాని మోదీ, ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్ల మధ్య చోటుచేసుకున్న అనుకూల ‘కెమిస్ట్రీ’ ని సైతం ఈ పరిణామం సూచిస్తోంది.

ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ను ఆహ్వానిస్తూ ప్రపంచీకరణ విస్తరణలో, పర్యావరణ పరిరక్షణలో భారత్ కీలక పాత్రను ఫ్రెంచి ప్రెసిడెంట్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2015లో పారిస్‌లో జరిగిన సివొపి21 సమావేశం సమయంలో మోదీ నాటి ఫ్రెంచి ప్రెసడెంట్ ఫ్రాంకోస్ హోలాండెతో కలిసి సంయుక్తంగా ఇంటర్నేనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఎ)ని ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. తర్వాత 2017లో సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొని వచ్చేటప్పుడు మోదీ పారిస్ వెళ్లి కొత్తగా ఎన్నికైన ఫ్రెంచి ప్రెసిడెంట్ మాక్రాన్‌ను నేరుగా కలిసి తన అభినందనలను తెలియజేశారు కూడా. ఇదంతా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు. ప్రధాని నరేంద్ర మోది, ఫ్రెంచి ప్రెసిడెంట్ మాక్రాన్లు ఇరువురూ పారిస్ ఒప్పందం కింద   చేసుకున్న ఒప్పందాలకు తాము కట్టుబడి వ్యవహరిస్తామని స్పష్టంగా ప్రకటించారు. 2018, మార్చిలో ఫ్రెంచి ప్రెసిడెంట్ భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఐఎస్ఎ స్థాపక సదస్సు జరిగింది. ఇరుదేశాలూ చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయాలనేదే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.

ప్రపంచీకరణ అంశంతో పాటు వాతావరణ మార్పు, వాతావరణ న్యాయం, అలాగే ఉగ్రవాద అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రెంచి ప్రెసిడెంట్ మాక్రాన్ ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి. భారత్, పారిస్ రెండు దేశాలు కూడా భయంకరమైన ఉగ్రదాడుల బారిన పడిన దేశాలే. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో సర్దుబాటుకు తావులేని విధంగా కఠినంగా వ్యవహరించాలని రెండు దేశాలూ దృఢంగా నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి తగిన చర్యలను చేపట్టే విషయంలో సైతం ఇరుదేశాలూ ఎంతో సానుకూలంగా స్పందించాయి. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలన్న భారత పిలుపుకు ఫ్రాన్స్ తన మద్దతును తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 8, 2019న మాల్దీవుల పార్లమెంటులో ప్రసంగిస్తూ ఈ ప్రతిపాదనను పేర్కొన్నారు.

జి-7 దేశాల్లో   అతి పెద్ద, అత్యాధునిక ఆర్థికరంగాలతో కూడిన ఏడు దేశాలు ఉన్నాయి. గ్లోబల్ మొత్తం సంపదలో వీటివే 58 శాతం వరకూ (317 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు) ఉన్నాయి. సాధారణ విలువల ప్రాతిపదికగా గ్లోబల్ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 46 శాతం మించి ఈ దేశాల  వాటా ఉంది. అంతేకాదు పర్చేసింగ్ పవర్ పారిటీ (పిపిపి) పరంగా గ్లోబల్ జిడిపి 32 శాతం ఉంది. ఈ జి-7 దేశాల్లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. జి-7 శిఖరాగ్ర సదస్సుకు యూరప్ కూటమి దేశాలు కూడా ప్రాతినిధ్యం వహించాయి. ఈ గ్రూపు తొలుత 1975లో జి-6గా ఫ్రాన్స్ ఏర్పాటుచేసింది.  ఆ తర్వాత సంవత్సరం ఈ గ్రూపులో కెనడా కూడా చేరడంతో ఇధి జి-7గా అవతరించింది. ఈ గ్రూపులోకి చేరాల్సిందిగా 1997లో రష్యాను కూడా ఆహ్వానించారు. అలా జి-8గా ఏర్పడాలని ఇది భావించింది. కానీ 2014లో ఎప్పుడైతే రష్యా క్రిమియాపై దాడికి పూనుకుందో అప్పుడు ఈ బృందం నుంచి రష్యాని మినహా యించారు.

ఈ గ్రూపు ప్రారంభమైన నాటి నుంచి ఇది గ్లోబల్ ఆర్థిక అంశాలతోపాటు ఆర్థిక పరిణామాలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థికరంగ ప్రగతిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలాంటి నిర్ణయాలు తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆర్థికపరమైన, భద్రతాపరమైన, అలాగే ఎనర్జీ సంబంధమైన విధానాలకు సంబంధించి సహకార సాధనలో జి-7 ముఖ్యమైన వేదికగా కొనసాగుతోంది. కానీ 1999లో జి-20 ఉనికిలోకి రావడంతో జి-7 పరిస్థితి ప్రశ్నార్థకంలో పడింది. మొత్తం 19 దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్‌తో పాటు యురోపియన్ కూటమితో కలిపి ఏర్పడింది. 2007-08  సంవత్సరం మధ్యలో అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య సంక్షోభం సమయంలో హెడ్ ఆఫ్ ది స్టేట్ లేదా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ స్థాయికి జి-20 ఎదిగింది. ప్రారంభంలో జి-20 సంవత్సరానికి రెండు సార్లు సమావేశమయ్యేది. కానీ ఇటీవల కాలంలో వార్షిక సమావేశాలను మాత్రమే నిర్వహిస్తోంది. భారత్ ఈ సమావేశానికి క్రమంతప్పకుండా హాజరవుతూ వచ్చింది. అంతేకాదు చర్చల్లో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకుంది. త్వరలో ఒసాకాలో జరిగనున్న జి-20 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ సదస్సు జపాన్‌లోని ఒసాకాలో ఈ నెల 28వ తేదీ నుంచి 29 వరకూ జరుగుతాయి.

జి-7 సదస్సులో పాల్గొన్న అనంతరం భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా పారిస్ వెడతారు.

జి-7లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం వల్ల పశ్చిమ సరిహద్దుల్లో చెలరేగుతున్న ఉగ్రవాదంపై పోరులో  లబ్ది పొందడానికి భారత్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అలాగే గ్లోబల్ పర్యావరణ పరిరక్షణ, న్యాయమైన, సమతుల్యతతో కూడిన బహుపక్ష వాణిజ్య విధానాన్ని పెంపొందించడంలో కూడా  ఇంకా ముందుకు పోవడానికి సమయం పడుతుంది. ప్రధాని ఈ సదస్సులో పాల్గొనడం ఎంతో ప్రయోజనకరం. కానీ ఆ రకమైన అడుగులు ఇంకా మరెన్నింటినో మోదీ ముందుకు వేయాల్సి ఉంది.
రచన: అంబాసిడర్ అశోక్ సజ్జనార్, భారత మాజీ దౌత్యవేత్త, ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ స్టడీస్ ప్రెసిడెంట్

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం