జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం


రెండు రోజులపాటు జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం జపాన్‌లోని ఫుకుకాలో జరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ఈ సమావేశం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో జి20 సభ్యదేశాలకు చెందిన పలురకాలైన వాణిజ్య, టారిఫ్ అంశాలపై సుదీర్ఘ సమాలోచనలు, చర్చలు చేయడమే కాకుండా ఈ నెల అనంతరం ఒసాకాలో జరగనున్న జి20 శిఖరాగ్ర సదస్సు ఏర్పాట్లకు సంబంధించిన గ్రౌండ్ వర్కుపై కూడా సమావేశం చర్చించింది. ఈ సమావేశం ఆర్థికంగా శక్తివంతమైన దేశాలైన చైనా, అమెరికాలు చేపట్టిన రక్షణవాద విధానంపై మరోమారు దృష్టిసారించడంతో పాటు దాన్ని పున: పరిశీలించే అవకాశానికి ఈ సమావేశం మార్గం వేయనుంది. ఇదే కాకుండా, బహుళజాతి టెక్నాలజీ, డిజిటల్ కంపెనీలైన ఫేస్‌బుక్, గూగుల్ వంటి వాటికి కొత్త పన్నుల విధానం రూపొందించాల్సిన అవసరన్ని కూడా ఈ సమావేశం గుర్తించింది. దీంతోపాటు నానాటికీ తీవ్రతరమవుతున్న హవాలా కార్యకలాపాలకు చెక్ పెట్టాల్సిన అవసరాన్ని సమావేశం పేర్కొంది. అలాగే ప్రంపంచమంతటా వ్యాపించిన బ్యాంకు మోసాలు, ఆర్థిక నేరాలు, ద్రవ్యనేరాలు వంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరంపై కూడా ఈ సమావేశం తీవ్రంగా చర్చించింది.


అమెరికా-చైనాల మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో జి20 దేశాలకు చెందిన ఆర్థిక మంత్రుల ఫుకుకా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు సంక్షోభంలో పడడమే కాదు ప్రపంచ వాణిజ్యం మీద భారీస్థాయిలో దుష్పరిమాణాలు తలెత్తడానికి కారణమవు తున్నాయి. 379 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు అమెరికాకు చైనాతో ఉంది. దీన్ని పరిష్కరించుకోవడానికి అమెరికా అదనంగా 25 శాతం పన్నును చైనా దిగుమతులపై వేసింది. ఈ దిగుమతుల విలువ 250 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుంది. దీంతో చైనా కూడా ప్రతీకారచర్యగా 110 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన పన్నులను అమెరికా దిగుమతులపై అదనంగా విధించింది. ఈ పరిణామాలతో ప్రపంచ వాణిజ్య వృద్ధి అర శాతం పడిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల్లో గ్లోబల్ పెరుగుదల 2019 సంవత్సరానికి 3.6 శాతం నుంచి 3.3 శాతానికి పడుతుందని పేర్కొంది. రానున్న ఒసాకా జి20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా, చైనాలు కూర్చుని వాణిజ్య అంశాలపై ద్వైపాక్షికంగా చర్చిస్తేనే తప్ప ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ముగిసే అవకాశాలు లేవు.


అమెరికా సెక్రటరీ ఆఫ్ ట్రజరర్ స్టవెన్ మెచిన్ ఫుకుకా సదస్సులో పాల్గొన్నారు. అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం పట్ల స్టీవన్ ఎలాంటి ఆందోళనను లేవనెత్తలేదు. దానికి బదులు అమెరికా, చైనా తమ వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోలేని పక్షంలో చైనాకు సంబంధించిన ఇతర దిగుమతలపై సైతం అమెరికా అదనపు పన్నులను విధిస్తుందని, ఆ పన్నుల మొత్తం విలువ 300 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటాయని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు చైనా మీద విధించిన పరిమితుల వల్ల చైనా పెట్టుబడులు, మిశ్రమ తయారీ వస్తువులు ఇతర దేశాలకు (అమెరికాకు సైతం) వెళ్లడం ద్వారా ప్రపంచ ఆర్థిక రంగం వృద్ధి చెందుతుందని అమెరికా భావిస్తోంది. యూరప్ దేశాలలో ఎంతో ఒత్తిడితో కూడిన ఆర్థిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ చేసిన ప్రకటనను గమనించాలి. ఎందుకంటే ఆ దేశాలు తాజా పెట్టుబడుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూపులు చూస్తున్నాయి. అమెరికా, చైనా తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ గల మూడవ దేశమైన జపాన్ ప్రస్తుతం జి20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. 1999లో జి20 ప్రారంభమైన తర్వాత తొలిసారి జపాన్ ఈ సదస్సును తన దేశంలో ఆతిథ్యం ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల బాగా ఇబ్బందిపడుతున్నది జపానే. జపాన్ ఆర్థిక మంత్రి తరో అసొ మాట్లాడుతూ ‘అమెరికా, చైనాలు అనుసరిస్తున్న రక్షణవాద విధానం కారణంగా జపాన్‌లోని శక్తివంతమైన ఆర్థికరంగంలో అభివృద్ధి కుంటుపడుతోంద’ని ఆందోళన వ్యక్తంచేశారు.

జి20 ఆర్థిక మంత్రుల సదస్సు ద్వైపాక్షిక ఆర్థిక సహకారం కింద పన్నులు పక్కనపెడుతూ ఒక కొత్త ప్రపంచ క్రమాన్ని సృష్టించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ అభిప్రాయ పడుతుంది. అలాగే సరికొత్త అంతర్జాతీయ టాక్స్ రిజీమ్‌ని వ్యవస్థాపించాలని అభిప్రాయపడుతోంది. భారతదేశ నూతన ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఫుకుకా సమావేశానికి హాజరవడానికి ముందే తన ఎజెండా ఏమిటో స్పష్టం చేశారు.

ఈ చర్యలు తీసుకోకపోతే జి20 దేశాల రెవెన్యూ సామర్థ్యం దెబ్బతింటుందని భారత్ భావిస్తోంది. టెక్నాలజీ మల్టీనేషనల్స్ భారీ స్థాయిలో పన్నుకట్టకుండా దాటవేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యూజర్, సంబంధిత దేశం తదితర విషయాలను లెక్కకట్టడం చాలా కష్టం. గమనించాల్సిన మరో ముఖ్య విషయం కూడా ఉంది. అదేమిటంటే అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వల్ల భారత్‌కు అమెరికాతో ఉన్న వాణిజ్య లాభాలు కూడా దెబ్బతింటున్నాయి.


జి20 దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 2/3 వంతు ఉంటారు. మొత్తం గ్లోబల్ వాణిజ్యంలో వీరు 85 శాతం ఉంటారు. ఫుకుకా సమావేశంతో పాటు ప్రపంచంలోని 50 దేశాల నుంచి వచ్చిన ట్రేడ్ అండ్ కామర్స్ మంత్రుల సమావేశం కూడా జరిగింది. ఒసాకాలో జరగబోయే జి20 శిఖరాగ్ర సదస్సులో ఏకాభిప్రాయ సాధన కోసం ఫుకుకా జి20ఫైనాన్స్ నాయకులు కొత్త వేదికను ఏర్పాటుచేసే ఆలోచనలో కూడా ఉన్నారు.

రచన: మనోహర్ మనోజ్, జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం