రెండవసారి పదవీ ప్రమాణం చేసిన మోదీ ప్రభుత్వం

భారీ మెజారిటీతో దేశ ప్రజలు మోదీని గెలిపించిన తర్వాత నరేంద్ర మోదీ భారత ప్రధానిగా రెండవ పర్యాయం పదవీస్వీకార ప్రమాణం చేశారు. ప్రధాని నేతృత్వంలోని 58 మంది మంత్రులతో కూడిన మంత్రిమండలి చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారతీయ జనతాపార్టీ, మిత్రపక్షాలలోని ప్రతిభావంతులైన వారికి మంత్రి పదవులను ఇచ్చారు. వీరిలో భారత మాజీ కార్యదర్శి సుబ్రమణియన్ జైశంకర్ కూడా ఉన్నారు.

ప్రధాని మోదీ జైశంకర్‌ని ఎంపిక చేసుకోవడం కూడా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖలో ముఖ్య సహాయకులుగా ఆయన ఉన్నారు. చైనా విషయంలో ఆయన చూపిన ప్రతిభాసామర్థ్యాలు ఆయనకు లాభకరంగా పరిణమించాయనడంలో సందేహంలేదు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కూడా మోదీ ఈసారి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మోదీ ప్రభుత్వంలో అమిత్ షా కీలకపాత్ర నిర్వహిస్తారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలు ఈసారి బిజెపిని గెలిపించడం, రెండవసారి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం వెనుక దేశంలోని ప్రజల ఆంకాంక్షలను వెల్లడిస్తోందంటూ మోదీ పలుమార్లు వ్యక్తం చేయడం మరవలేం. రాష్ట్రపతి ప్రమాణం స్వీకారం చేయించిన కేంద్ర మంత్రిమండలిలో పాన్-ఇండియా స్ఫూర్తి ప్రతిఫలిస్తోంది. ఈ మంత్రిమండలి ఏర్పాటులో యువత పట్ల అనుకూలంగా ప్రధాని మోదీ స్పందించడం కనిపిస్తుంది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ‘నారా’ (నేషనల్ యాంబిషన్+రీజినల్ యాస్పిరేషన్) స్ఫూర్తితో పనిచేస్తుందని మోదీ పలుమార్లు స్పష్టంచేశారు కూడా. అభివృద్ధి సహిత సుపరిపాలనే తన ప్రభుత్వ రోడ్-మ్యాప్ అని ఆయన స్పష్టంచేశారు.

మంత్రుల ఎంపికలో కూడా మార్పు మంత్రం కనిపిస్తోంది. రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్ విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తొమార్, పీయూష్ గోయల్, శ్రీమతి స్మృతీ ఇరానీ వంటి వారు మోదీ గత ప్రభుత్వంలో కూడా పనిచేశారు. వీరిని రెండవ పర్యాయం కేంద్ర మంత్రిమండలిలోకి మోదీ తీసుకున్నారు. అలా దేశానికి రెండవ పర్యాయం సేవ చేసే అవకాశాన్ని వారు దక్కించుకున్నారు. మోదీ మంత్రి మండలిలో కొందరు జూనియర్ మంత్రులకు కూడా బెర్త్ దొరికింది. వారిలో గజేంద్ర సింగ్ షెకావత్, గిరిరాజ్ సింగ్, మహేంద్ర నాథ్ పాండే వంటి వారికి కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. వారు పార్టీ పరంగా చేసిన కృషికి గాను ఈ పదోన్నతి దక్కింది.

మోదీ ఏర్పాటుచేసిన 58మంది సభ్యులతో కూడిన కేంద్ర మంత్రి మండలిలో 24 మంది కేబినెట్ మంత్రులు, ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తూ విధులు నిర్వహించే తొమ్మిదిమంది సహాయమంత్రులతో పాటు మరో 24 మందికి కూడా సహాయమంత్రి పదవులు ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అఖండ తీర్పులో దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్డీఎ సంకీర్ణ కూటమికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అందుకే మంత్రిమండలిలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులను తీసుకోవడం కనిపిస్తుంది. దాంతో కేంద్ర మంత్రిమండలిలో పాన్-ఇండియా ప్రాతినిధ్యం కనిపిస్తోంది. నిజమైన జాతీయ ప్రభుత్వ స్ఫూర్తి మంత్రిమండలిలో ప్రతిఫలిస్తోంది.

మోదీ తన మంత్రివర్గంలో తీసుకన్న వారిలో మరో ఆశ్చర్యకరమైన ఎంపిక ప్రతాప్ చంద్ర సారంగి. ఒడిశాలోని బలాసోర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక గుడిశలో నిరాడంబరంగా ఆయన జీవిస్తారు. ప్రజాజీవితంలో నిరాడంబరంగా జీవితం కొనసాగించాలన్న మహాత్మాగాంధీ మాటలకు ఆయన ప్రతిరూపం అని చెప్పాలి. ప్రజాసంక్షేమం కోసం సారంగి ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఎందరో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రధాని మోదీని సైతం తన నిరాడంబర జీవనశైలి, నిబద్ధతలతో ముగ్ధులను చేశారు.

మంత్రిమండలి ప్రమాణ స్వీకారంతో 17వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. పార్లమెంటులోని దిగువసభ లోక్‌సభలో మంత్రుల ప్రమాణం కోసం కాబినెట్ తొలి సమావేశం జరగుతుంది.

భారతదేశ ప్రజాస్వామ్యం ఎంతో స్ఫూర్తిదాయకమైందన్న మాటలు అక్షరసత్యాలు. 900 మిలియన్ల మంది పైగా ఉన్న ఓటర్లలో 67 శాతం మంది తమ ఓటుహక్కును ఉపయోగించుకున్నారు. మోదీ అభివృద్ధి ఎజెండాకు రెండవ పర్యాయం పట్టం కట్టారు. అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిపై కూడా ప్రభుత్వం అంతే నిబద్ధతతో దృష్టి పెట్టారు.

మోదీ రెండవసారి అధికార పగ్గాలు చేపట్టారు. కానీ గ్లోబల్ ఎకానమీ పరంగా అననుకూల పోకడలు కనిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం దీనిపై ప్రధానంగా దృష్టిపెట్టాల్సి ఉంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం అమెరికా-చైనాల మధ్య నడుస్తున్న టారిఫ్ వార్ తీవ్రతను ప్రత్యక్షంగా చూస్తోంది.. అలాగే పర్షియన్ గల్ఫ్ సంక్షోభం కూడా తీవ్రతరమవుతోంది. అమెరికా ఇరాన్‌పై తిరిగి పరిమితులు విధించడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఫలితంగా ముడిచమురు ధరలు గ్లోబల్ స్థాయిలో బాగా పెరిగాయి. ఇది భారతదేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. మోదీ ప్రభుత్వం తొలి పర్యాయం అధికారంలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని కఠినంగా అరికట్టడంలో విజయం సాధించారు. అలాగే భారత ద్రవ్యోల్బణం పెరగకుండా ఈ పర్యాయం కూడా దాన్ని నియంత్రణలో పెట్టాలన్న ఆశలు మోదీపై ఉన్నాయి. అలాగే భారత వ్యవసాయరంగం అభివృద్ధికి గాను ప్రధాని మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలా భారత రైతాంగం జీవన ప్రమాణాలను పెంచాల్సి ఉంది.

రాష్ట్రపతి భవన్‌లో వైభవోపేతంగా జరిగిన ప్రధాని ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని పలు దేశాధినేతలు, అలాగే బిఐఎంఎస్‌టిఇసి ( బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్) దేశాలు వీక్షించాయి. కిర్జిస్తాన్ ప్రెసిడెంట్, మారిషస్ ప్రధాని కూడా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. పొరుగుదేశాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. భారత ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ పాలసీని అద్దంపడుతుంది. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధే భారత్ ఉద్దేశమనే విషయం విస్పష్టమవుతోంది.

రచన: మనీష్ ఆనంద్, సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ ప్రెస్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన