ఇండొనేసియాలో తిరిగి అధికారంలోకి వచ్చిన జొకోవి

ఇండొనేసియాలో ఎన్నికలు జరిగిన ఒక నెల అనంతరం ‘జొకోవి’గా ప్రసిద్ధులైన జొకో విడుడు ఇండొనేసియా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్టు ప్రకటించారు. ఇండొనేసియాలో ఏప్రిల్ 17న ఎన్నికలు జరిగాయి  ప్రెసిడెంట్, వైస్‌-ప్రెసిడెంట్ ఎన్నికలతో పాటు పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ, స్థానిక లెజిస్లేటివ్ బాడీలకు కూడా ఎన్నికలు జరిగాయి.  

 కేవలం ఒక రోజులోనే ఎంతో సంక్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. 154 మిలియన్ల మంది ఓటర్లు, వందలకొద్దీ ద్వీపసమూహాలతో కూడిన ఇండొనేసియాలో   ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశారు. ఇండొనేసియా జనరల్ ఎలక్షన్ కమిషన్ (కెపియు) ఏప్రిల్ 17న నిర్వహించిన ఎన్నికల ఫలితాలను మే 21న ప్రకటించింది.

భారత దేశంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ భారీ సక్సెస్‌తో  విస్తృత ఆసియాలో జొకోవి విజయం మరింత ఆసక్తిని సంతరించుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియాలో స్కాట్ మారిసన్ విజయం కూడా కీలక ప్రభావం చూపనుంది. ఈ మూడు ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలు తమ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల పండుగను విజయవంతంగా పూర్తిచేసుకున్నాయి. ఓట్ల ద్వారా ఈ దేశాలలోని ప్రజలు తమ అభిప్రాయాన్ని ఆవిష్కరించారు.  

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూడు దేశాలలోనూ పదవిలో లేని నాయకులు ఎన్నికల సమరంలో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ అవి నిజం కాలేదు. ఎందుకంటే జొకోవి ఇండొనేసియాలో, మోదీ  భారత్‌లో, మోరిసన్ ఆస్ట్రేలియాలో ఘన విజయం సాధించి తమ పదవులను తిరిగి కైవసం చేసుకున్నారు.

ఇండొనేసియా ఎన్నికల్లో జొకోవి 55 శాతం పైగా ఓట్లను సాధించారు. అంటే 85 మిలియన్ల ఓట్ల కన్నా ఎక్కువ  జొకోవి ఖాతాలో పడ్డాయి. ఆయన ప్రత్యర్థి ప్రబొవొ సుబియాంటోకి 45 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. గతంలో ప్రబొవొ సుభియాంటో సెపషల్ ఫోర్సెస్ కమాండర్‌గా పనిచేశారు.  2014లో జొకోవీకి వ్యతిరేకంగా బరిలోకి ప్రబొవో దిగి పోరాడారు కానీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో జొకోవీ సాధించిన ఓట్ల సరళి ఇండొనేసియా ప్రజలలో ఆయనకు మద్దతు బాగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేసింది.

పీపుల్స్ కంసల్టేటివ్ అసెంబ్లీ (జాతీయ అసెంబ్లీ) స్థానాల్లో కూడా జొకోవీ సారథ్యం వహిస్తున్న ఇండొనేసియన్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగల్ (పిడిఐపి) 27 మిలియన్ల ఓట్లను సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. పిడిఐపి తర్వాత స్థానంలో 17.6 మిలియన్ల ఓట్లతో గరింద్రా పార్టీ నిలిచింది.

జొకోవీ ఎన్నికల విజయాన్ని ప్రబొవొ, ఇతర మద్దతుదారులు వ్యతిరేకించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, పక్షపాతధోరణిలో ఎన్నికల ప్రక్రియ సాగిందంటూ ప్రతిపక్షం జొకోవీ విజయాన్ని వ్యతిరేకించింది. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని, అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ప్రబొవొ నిరశన జకార్తాలో దాడులకు దారితీసింది. ఈ దాడుల్లో ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్టు, 200 పైగా ప్రజలు తీవ్రంగా గాయాలపాలయ్యారని  తెలుస్తోంది. ఈ దాడులను ప్రబొవొ అనుకూదారులే పాల్పడినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం వాతావరణం అదుపులోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో మరిన్ని దాడులు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా సోషల్ మీడియాను బ్లాక్ చేశారు.

రాజ్యాంగబద్దమైన న్యాయస్థానంలో ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ పిటిషన్ చేపట్టాలని ప్రొబొవో నిర్ణయించుకున్నారు. ఇదే చర్యను గత ఎన్నికల సమయంలో కూడా ప్రబొవొ చేపట్టారు కానీ అప్పుడు వైఫల్యం చెందారు. ఈసారి కూడా అదే రకమైన ఫలితం ప్రొబొవోకు ఎదురవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసు కున్నాయంటూ  ప్రతిపక్షం గట్టి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించలేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు.

జొకోవి ఇండొనేసియా ప్రెసిడెంట్‌గా, మోదీ భారత ప్రధానిగా తిరిగి ఎన్నికయ్యారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రాంతీయ శాంతి, సుస్థిరత, ఆర్థిక ప్రగతి, సంప్రదాయ, సంప్రదాయేతర భద్రతా సవాళ్లు వంటి  పలు అంశాలపై ఇరు దేశాల ప్రయోజనాలు, అవకాశాలను ఇవి పంచుకుంటాయి. వీటికి తోడు ఆసియాన్ (ఎఎస్ఇఎఎన్) సారథ్యంలో నడుస్తున్న తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు, ఆసియాన్ రీజనల్ ఫోరమ్ సమావేశాలతో పాటు భారత్, ఇండొనేసియాలు జి-20 వంటి ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థల్లో కూడా సభ్యులుగా ఉన్నాయి.

గత ఏడాది భారత ప్రధాని మోదీ ఇండొనేసియాలో పర్యటించినపుడు రెండు దేశాలూ తమ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్) స్థాయికి తీసుకు వెళ్లాయి. అంతేకాదు ఇండొనేసియా గ్లోబల్ మారిటైమ్ ఫుల్‌క్రమ్, ఇండియా యాక్ట్ ఈస్ట పాలసీలు, అలాగే ‘సాగర్’ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్) విజన్‌లను పరిశీలిస్తే వీటి మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ఇవే రెండు దేశాల వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యాలను పరస్పరం కలిసిపోయేలా చేశాయి. 20 బిలియన్ అమెరికన్ డాలర్ల  మేర ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోంది. భారత ప్రధాని ఇండొనేసియా పర్యటనలో 2025 సంవత్సరం నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చాలని నిర్ణయించు కున్నాయి.


రెండు దేశాల నాయకులు తిరిగి ఐదు సంవత్సరాలు అధికారంలో కొనసాగనున్నారు. కాబట్టి ఇరుదేశాల నాయకులు తమ దేశ ప్రయోజనాల సాధనా దిశగా పరస్పరం సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు వాణిజ్యం, పెట్టుబడులు, వివిధ రంగాలలో సహకార పెంపుదలకు కొత్త మార్గాలను వెదకడం వంటి వాటి పరంగా తలెత్తే అడ్డంకులను తొలగించడం ద్వారానే  లక్ష్యం సాధ్యమవుతుంది.

రచన: డా. రాహుల్ మిశ్రా, తూర్పు, ఆగ్నేయాసియా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన