నిఘా సామర్థ్యం పెంచుకునే దిశగా అంతరిక్షంపై భారత కన్ను

భారత నూతన ఎర్త్ అబ్సర్వేషన్ ఉపగ్రహం రీశాట్-2బి (ఆర్ఐఎస్ఎటి-2బి, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్) టెక్స్ట బుక్ ప్రయోగం బుధవారం ఉదయం జరిగింది. ఇది భారతదేశ నిఘా సామర్థ్యాలను మరింతగా పెంపొందిస్తుంది. ఇది ఇరవైనాలుగు గంటలూ భారత సరిహద్దులను కాపుకాస్తుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులలో నైనా నిఘా కొనసాగుతుంది. 615 కిలోగ్రాముల బరువు ఉన్న రీశాట్-2బి మిషన్ జీవితకాలం ఐదు సంవత్సరాలు.

ఈ ఉపగ్రహాన్ని దేశ సరిహద్దుల్లో నిఘా కోసం ఉపయోగిస్తారు. తద్వారా చొరబాటుదారులు, ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు. అంతేకాదు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పలు కార్యకలాపాలు చేపట్టవచ్చు కూడా. సంప్రదాయ రిమోట్-సెన్సింగ్ ఉపగ్రహాలకు మల్లే భూమిపై కనిపించే వెలుతురులో దృశ్యాలను సమీకరిస్తుందే తప్ప రాత్రుళ్లు, మబ్బులు కమ్మిన వాతావరణంలో ఇమేజెస్‌ను తీయలేదు. కానీ రీశాట్ 2బి ఉపగ్రహం రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఇందులో సింథటిక్ అపెర్చర్ రాడార్ అని పిలవబడే యాక్టివ్ సెన్సర్లు ఉన్నాయి. ఈ శాటిలైట్ అంతరిక్షం నుంచి రాడార్ కిరణాలను వదలడం ద్వారా రాత్రి, పగలు అనే తేడా లేకుండా భూమి మీద ఉన్న దృశ్యాలను ఇట్టే పట్టేస్తుంది. అంతేకాదు ఆకాశం మబ్బులతో నిండి ఉన్నప్పుడు కూడా ఇమేజెస్‌ను ఇది సులభంగా తీస్తుంది. రీశాట్-2బి లోని ఎక్స్-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అదనపు వివరాలను సైతం అంటే భూ ఉపరితలంపైన ఉండే ఆబ్జక్టుల పరిమాణం, నిర్మాణాలు, వాటి కదలికలు, మార్పులు వంటి వివరాలను సైతం అందిస్తుంది.

రీశాట్-2బినే కాకుండా, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్‌వి-సి46) రెండు ముఖ్యమైన పేలోడ్స్‌ ను తీసుకెళ్లింది. ఈ పేలోడ్స్ ను దేశీయంగా అతి తక్కువ ఖర్చుతో అభివృవృద్ధి చేశారు. విక్రమ్ ప్రోసెసర్, తక్కువ ఖరీదుతో రూపొందించిన ఇనెర్షియల్ నావిగేషన్ సిస్టమ్‌లు భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న అంతరిక్ష వాహన మిషన్లను ఎంతగానో విప్లవీకరించనుందని భారత అంతరిక్ష అధ్యయన (ఇస్రో) సంస్థ ఛైర్మన్ డా. కె. శివన్ తెలిపారు. విక్రమ్ ప్రోసెసర్‌ను చండీఘడ్‌లోని సెమికండక్టర్ కాంప్లెక్స్‌లో అభివృద్ధి చేశారు. ఇది భవిష్యత్తులో ఇస్రో ప్రయోగించే ప్రయోగ వాహకాలను నియంత్రిస్తుంది.

రీశాట్ సీరిస్ ఉపగ్రహాలు ఇస్రో రూపొందించిన తొలి సమగ్ర భూవాతావరణ పరిశీలక ఉపగ్రహాలు. దీనికి ముందు భారత్ రూపొందించిన పరిశీలక ఉపగ్రహాలు ప్రధానంగా ఆప్టికల్, స్పెక్ట్రల్ సెన్సర్స్ మీద ఆధారపడి రూపొందించినవి. వీటికి చీకటి, మబ్బులు ఆటంకాలుగా నిలిచేవి. సమగ్ర వాతావరణాన్ని చూడగల లక్షణం ఉన్న ప్రస్తుత ఉపగ్రహం విషయానికి వస్తే భద్రతా దళాలు, ప్రకృతి వైపరిత్యంలో సహాయక చర్యలకు తోడ్పడే ఏజెన్సీలకు ఈ రాడార్ దృశ్యాల సేవలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. నిర్మాణాల దృశ్యాలను కూడా రీశాట్-2బి పట్టుకుంటుంది. అలాగే కొత్త బంకర్లను గుర్తిస్తుంది. కొన్నిసార్లు అలాంటి బంకర్లు అవీ ఎన్ని ఉన్నాయో కూడా లెక్కించి తెలియజేస్తుంది. ఇలాంటి డేటా ఏజన్సీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆకాశంలో మబ్బులు పట్టినపుడు, వర్షం కురిసేటప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు ఉపరితల ఇమేజరీస్ ఏజెన్సీలకు కావలిసి వస్తే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

మనదేశంలో పంటల అంచనాకు కూడా రాడార్ ఇమేజింగ్‌ని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మన ప్రధాన పంటలు పండే ఖరీఫ్ సీజన్ మే నుంచి సెప్టెంబరు వరకూ వర్షాలు పడ్డప్పుడు, మేఘాలు కమ్మినపుడు ఉంటుంది. రిశాట్-2బి డేటాను అటవీరక్షణ, మట్టి, భూమి వాడకం, భౌగోళిక అంశాలు, వరదలు, తుఫానులు వచ్చిన సందర్భాలలో కూడా వాడతారు.

పది సంవత్సరాల కాలంలో రిశాట్-2బి భారత మూడవ రాడార్ ఇమేజింగ్. ప్రారంభంలో రూపొందించిన రిశాట్స్‌ సహాయంతో పనులు సాగిపోతున్నా, నవంబరులో ముంబయి దాడులు జరిగిన నేపథ్యంలో ఈ శాటిలైట్ ప్రయోగ ప్రణాళిక మరింత ఆధునీకరించారు. రిశాట్-1 కన్నా ముందు రిశాట్-2ను ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. అప్పటి నుంచి దేశీయ సి-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్‌ను రిశాట్1కి వాడాలనుకుంది కానీ అప్పటికి అది సిద్ధం కాలేదు. రిశాట్-2లో ఇస్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఎక్స్-బ్యాండ్ సెన్సర్‌ని వాడారు. అందుకని రిశాట్-2ని 2009లో ప్రయోగించారు. రిశాట్-1ని 2012లో ప్రయోగించారు. ఈ రెండు శాటిలైట్ల జీవితకాలం చివరిదశకు వచ్చింది. రిశాట్-2 స్థానంలో రిశాట్-2బిని ప్రవేశపెట్టారు.

రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాల సీరీస్ నొకదానిని రానున్న నెలల్లో ఇస్రో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. తద్వారా అంతరిక్ష ఆధారిత భూ పరిశీలనను, ముఖ్యంగా భారత ప్రాంత పరిశీలనా సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటిల్లో కనీసం నాలుగు లేదా ఐదింటిని ఈ ఏడాదిలోనే తీసుకురావాలని పథకాలు వేస్తోంది.

ఇటీవల విజయవంతంగా చేసిన ప్రయోగం భారత పిఎస్ఎల్‌వి రాకెట్ సామర్థ్యాన్ని, క్రెడిట్‌ని మరోసారి నిరూపించింది. ఇది ఇస్రో కీలకమైన ‘వర్క్ హార్స్’ గా నిలిచింది. పిఎస్ఎల్‌విలో పిఎస్ఎల్‌వి-సి46 పధ్నాల్గవ ప్లైట్. దీనిలో ఘనరూపక స్ట్రాప్-ఆన్ మోటర్లను ఉపయో గించకుండా రూపొందించడం జరిగింది. ఈ రోజు వరకూ ఇస్రో మొత్తం 48 ప్రయోగాలు చేసింది. వీటిల్లో రెండు వైఫల్యాలనే ఇప్పటి దాకా ఈ రాకెట్ చవిచూసింది. 1993లో దీని తొలి డెవలెప్‌మెంటల్ ఫ్లైట్ వైఫల్యానికి గురైంది. 2017 సంవత్సరంలో, పిఎస్ఎల్‌వి బాగా పనిచేసింది. రాకెట్ ఎలాంటి అవాంతరాలు లేకుండా నింగికి ఎగిసింది. కానీ నావిగేషన్ ఉపగ్రహం అయిన ఐఆర్ఎస్ఎస్ఎస్-1హెచ్ కక్ష్యలోకి ప్రవేశించడంలో వైఫల్యం చెందింది. పిఎస్ఎల్‌వి-సి39 హీట్ షీల్డ్ కక్ష్యలోకి ప్రవేశించేటప్పుడు తెరచుకోవడంలో విఫలమైంది. పిఎస్ఎల్‌వినే చంద్రయాన్-1 మిషన్ ప్రయోగానికీ ఉపయోగించారు. 2008లో భారత్ చంద్రడిపై చేపట్టిన తొలి మిషన్ ఇది. 2013 సంవత్సరంలో భారత్ తన తొలి ‘ఇంటర్‌ప్లానటరీ మిషన్ టు మార్స్ ’ను కూడా చేపట్టింది.

చంద్రుడిపై చేపట్టని రెండవ మిషనే చంద్రయాన్-2. దీన్ని జూలైలో ప్రయోగించాలని నిర్ణయించారు. చంద్రడి దక్షిణ ధృవం సమీపంలో రోవర్‌ని దించే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ మిషన్‌ని భారత్ చేపట్టబోతోంది.

రచన: బిమన్ బసు, సీనియర్ సైన్స్ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన