దాటా దర్బార్‌పై ఆత్మాహుతి దాడి
లాహోర్ లోని ప్రముఖ సూఫీ మందిరమైన దాటా దర్బార్‌పై రంజాన్ పవిత్ర మాసం రెండవ రోజున భయంకర దాడి జరిగింది. దాడిలో పది మంది మృత్యుపాలయ్యారు. 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు నీడ కల్పిస్తూనే ఉందన్న విషయాన్ని ఈ ఘోర దాడి స్పష్టంచేస్తోంది. ఇప్పుడు పాక్ పరిస్థితి ఎలా మారిందంటే తను దీసిన గొయ్యలో తానే పడ్డట్టు ఉంది. పాకిస్తాన్‌లోనే తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఆత్మాహుతి దళాలు ప్రధానంగా ఉన్నత స్థాయి భద్రతా దళాలను టార్గెట్‌గా పెట్టుకుంది. దాటా దర్బార్ మందిరానికి రక్షణగా ఉన్న సైనిక దళాలపై ఆత్మాహుతిదళాలు కన్నువేశాయి. కారణం, రంజాన్ మాసంలో అక్కడకు భక్తులు భారీగా వస్తుంటారు.
పాకిస్తాన్‌లోని సూఫీ మందిరంపై ఉగ్రవాదులు దాడులకు పూనుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. షెహ్వాన్లోని లాల్ షాబాజ్ కలందర్, పఠాన్‌కోట్ లోని బాబా ఫరీద్, కరాచీలోని అబ్దుల్ షా ఘాజీలపై కూడా గతంలో ఉగ్రదాడులు జరిగాయి. ఈ మందిరాలు సూఫీ సంస్కృతిని ప్రతిఫలిస్తాయి. ఇవి ఉగ్రవాద బృందాలకు సులభమైన టార్గెట్లు అయ్యాయి. సూఫీలను అవి సంప్రదాయేతర ఆలోచనాపరులుగా భావిస్తాయి. దాటా దర్బార్‌పై చేసిన ఆత్మాహుతి బాంబు దాడికి తామే బాద్యులమంటూ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలైన పాకిస్తాన్ తాలిబాన్, లష్కరి-ఇ-ఝాగ్వి, హిజ్బుల్ అహ్రారార్ (స్థానిక తాలిబాన్ గ్రూపు నుంచి విడిపోయిన చీలిక వర్గంగా దీన్ని చెప్తారు) లు ప్రకటించాయి. రకరకాల దేవుళ్లను నమ్మేవారంటూ అన్ని ఉగ్రవాద బృందాలు సూఫీలను నిందించాయి. అందుకే సూఫీ మందిరాలపై అవి తీవ్రమైన శత్రుత్వాన్ని పెంచుకున్నాయి. అంతేకాదు వారి ఆచారవ్యవహారాలు తమ మతానికి అనుగుణంగా లేవనే అభిప్రాయం కూడా ఉగ్రవాద బృందాల్లో నాటుకుపోయి ఉంది.
దక్షిణ ఆసియాలోనే దాటా దర్బార్ అతిపెద్ద సూఫీ మందిరం. ప్రతి సంవత్సరాంతంలో వీళ్లు ఉర్సు సంబరాలను మూడు రోజులు వైభవంగా జరుపుతారు. ఈ సందర్భంలో పాకిస్తాన్ నలువైపుల నుంచి షియా, సన్నీలు ఇక్కడ జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సూఫీ మందిరం ఎంతో సింబాలిక్‌గా ఉంటుంది. అంతేకాదు చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తుంటారు. ఈ దర్బార్‌కు పాకిస్తాన్‌లోని ప్రముఖులు అంటే రాజకీయనాయకుల నుంచి అందరూ ఇక్కడకు వస్తారు. ఉర్సు ఉత్సవాల్లో అందరూ ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒక వారం రోజుల పాటు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఉగ్రదాడికి కేవలం రెండు రోజుల మందు నవాజ్ షరీఫ్ దాటా దర్బార్ మందిరాన్ని దర్శించుకుని వెళ్లారు. నవాజ్ షరీఫ్ ఈ పర్యటన పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) పునరాగమనాన్ని ప్రకటించడానికన్నట్టుగా ఉందని పాకిస్తాన్‌లోని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు తమ బల ప్రదర్శనగా కూడా నవాజ్ పర్యటనను విశ్లేషకులు అభివర్ణించారు. లేకపోతే తమ పార్టీ ఉనికి కొట్టుపోతుందనే ఆలోచన ఈ చర్య వెనుక ఉందంటున్నారు. ఇలాంటి వాతావరణంలో, దాటా దర్బార్ భద్రత పాకిస్తాన్‌కు ఎంతో ముఖ్యమైన అంశం. భద్రతా సిబ్బంది, చట్టాన్ని అమలు చేసే వారు దేశ భద్రతకు చిహ్నం. అందుకే భద్రతా సిబ్బంది ఉగ్రవాదసంస్థలకు టార్గెట్ అవుతుంటారు.
ప్రముఖ సూఫీ మందిరాన్ని శక్తివంతమైన భద్రతా సిబ్బంది పరిరక్షిస్తుంటుంది. అలాంటి మందిరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఈ దాడిలో ఆత్మాహుతి దళాలు పాల్గొనడం చూస్తుంటే పాకిస్తాన్లో ఇంకా ఉగ్రమూకల ఉనికి ఉందన్న విషయం స్పష్టమవుతోంది. అంతేకాదు తమదైన పూజా విధానాలను బోధించే సూఫీ మందిరాలు ఉగ్రవాదుల ప్రధాన టార్గెట్ అవుతున్నాయి. ముఖ్యంగా దాటా దర్బార్ మందిర ఉత్సవాలు అంగరంగవైభోగంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లోని సంగీత, నృత్య కార్యక్రమాలలో భక్తులు తన్మయిలవుతుంటారు. ఈ విధానాలను ఇస్లామ్ మతానికి వ్యతిరేకంగా పలు ఉగ్రవాద బృందాలు భావిస్తాయి.
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని దాట్ల దర్బార్ మందిరం ఉగ్రవాదుల టార్గెట్ కావడం ఇదే మొదటిసారేమీ కాదు. 2010 సంవత్సరంలో ఈ మందిరం రెండు భయంకరమైన ఆత్మాహుతిదళాల దాడులను చవిచూసింది. ఈ దాడుల్లో 50 మంది భక్తులు మృత్యుపాలయ్యారు. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్తాన్లో ఈ పరిణామాలు ఎంతో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. సూఫీ మందిరాలపై ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాద బృందాలు యువకులను ఆయుధాలుగా చేసుకుంటు న్నాయి. ఆ ప్రాంత అధికారులు మాట్లాడుతూ ఈసారి దాటా దర్బార్ మందిరంపై దాడిచేసిన ఆత్మాహుతి దళ సభ్యుడు 15 ఏళ్ల బాలుడని వెల్లడించారు. ఈ ఘటనలు ఉగ్రసంస్థలు ఎంత రహస్యంగా, దారుణంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయో వెల్లడిచేస్తున్నాయి. అంతేకాదు పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపడుతున్న వ్యూహం ఏమిటన్నదానిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెతుతున్నాయి. పైగా హిజ్బుల్ అహ్రార్ ఉగ్రవాద బృందాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసినట్టు పాకిస్తాన్ చెప్పుకోవడంపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. గత రెండు సంవత్సరాలుగా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో భారీ ఉగ్రదాడులేమీ జరగలేదు. దాటా దర్బార్ మందిరంపై జరిగిన దాడి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉగ్రవాద బృందాలు పాక్‌లో మళ్లీ విజృంభించాయన్న విషయాన్ని స్పష్టంచేసింది. పాకిస్తాన్లో ఉగ్రవాద బృందాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల్సిన అవసరం ఇంకా ఉందనే విషయాన్ని కూడా వెల్లడిచేస్తోంది. ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) బ్లాక్‌లిస్టులోకి పాక్ వెళ్లకుండా ఉండాలంటే, మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఎట్టకేలకు ప్రకటించిన ఈ సమయంలో ఉగ్ర సంబంధిత సంస్థలకు పాక్ పూర్తిగా తలుపులు మూయాల్సిన అవసరం ఉంది. దాటా దర్బార్ మందిరంపై జరిగిన ఆత్మాహుతి దాడి ఇస్లామాబాద్‌కు కనువిప్పు కావాలి. ఇంకా ఆలస్యం చేయకుండా పాకిస్తాన్ తన ఇంటిని అత్యవసరంగా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
రచన: డా. జైనాబ్ అఖ్తర్, పాకిస్తాన్ విశ్లేషకులు
Comments
Post a Comment