అమెరికా అధ్యక్షుడి పర్యటనతో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊపు



అమెరికా అధ్యక్షుడి పర్యటనతో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊపు

భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 36 గంటల అధికార పర్యటన ఆడంబరంగానేగాక అర్థవంతంగానూ సాగింది. భారత సందర్శనకు వచ్చిన అమెరికా అధ్యక్షులలో ఆయన ఏడో వారు కాగా; రెండు దశాబ్దాల వ్యవధిలో నలుగురు అధ్యక్షులు భారత్‌లో పర్యటించడం విశేషం. భారత-అమెరికా సంబంధాల ఊర్ధ్వముఖ పయనానికి ఇదొక సూచిక. అధ్యక్షుడి వెంట వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో ఆయన సతీమణి-ప్రథమ మహిళ మెలానియా సహా వారి కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా ఉన్నారు.

అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన అధ్యక్షుడు ట్రంప్‌కు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు స్వాగతం పలికారు. అటుపైన సబర్మతి ఆశ్రమం సందర్శించిన ట్రంప్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో లక్షా 25వేల మందికిపైగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఐదు నెలల కిందట హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ మోడీ’ సభలో భారీగా హాజరైన భారత-అమెరికన్లను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఇక అహ్మదాబాద్‌ సభలో ప్రధాని మోదీని, ఆయన నాయకత్వ పటిమను ప్రశంసలతో ముంచెత్తిన ట్రంప్‌, భారత్‌ సాధించిన విజయాలను కూడా ఘనంగా ప్రస్తుతించారు. కేవలం 70 ఏళ్లలోనే భారత్‌ దిగ్గజ ఆర్థికశక్తిగా ఎదిగిందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగానేగాక అద్భుతమైన దేశంగా అమెరికా అధ్యక్షుడు కొనియాడారు. దేశాధినేతలిద్దరి మధ్యగల అరుదైన వ్యక్తిగత సాన్నిహిత్యం ఈ కార్యక్రమంలో ఆద్యంతం ప్రస్ఫుటమైంది. ఆ తర్వాత ట్రంప్‌తోపాటు అమెరికా ప్రతినిధి బృందం ఆగ్రా వెళ్లి, ప్రపంచ ప్రసిద్ధ తాజ్‌మహల్‌ వైభవాన్ని ఆస్వాదించి వెనువెంటనే ఢిల్లీకి తిరిగి వచ్చింది.

రాష్ట్రపతి భవన్‌లో అపూర్వ స్వాగతంతో అధ్యక్షుడు ట్రంప్‌ అధికారిక కార్యక్రమాలు మొదలుకాగా, సతీమణి మెలానియాతో కలసి రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధివద్ద ఆయన నివాళి అర్పించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై సంభాషణ సందర్భంగా- పాకిస్థాన్‌ భూ భాగం నుంచి ఉగ్రవాద దుశ్చర్యలకు తావివ్వరాదని అక్కడి ప్రభుత్వానికి సూచించారు. అలాగే పఠాన్‌కోట్‌తోపాటు 26/11నాటి ముంబై ఉగ్రదాడులను, అలాంటివాటిని ప్రేరేపించేవారిపై తక్షణం విచారణ చేపట్టి శిక్షించాలని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రగతి, సుస్థిరత, భద్రత, అనుసంధానం దిశగా భారత్‌ అందిస్తున్న నిరంతర సహాయ-సహకారాలను ట్రంప్‌ ప్రశంసించారు. ద్వైపాక్షిక సమావేశంతోపాటు వాణిజ్యవేత్తలతో భేటీ తర్వాత దేశాధినేతలిద్దరూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అటుపైన ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందుకు ఆయనతోపాటు అమెరికా ప్రతినిధి బృందం కూడా హాజరయ్యారు.

ఈ ఉన్నతస్థాయి పర్యటనతో రెండు దేశాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం గణనీయంగా ముందడుగు వేసింది. రక్షణ, భద్రత రంగాల్లో సహకారానికి సంబంధించి రక్షణ రంగంలో భారత్‌కు తమ ప్రధాన భాగస్వామి హోదా ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ పునరుద్ఘాటించారు. కాబట్టి ఆయుధ కొనుగోళ్లు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలో అత్యున్నత స్థాయి పరిగణన ఉంటుందని స్పష్టం చేశారు. నావికాదళం కోసం MH-60Rతోపాటు AH-64E అపాచీ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు భారత్‌ ఇటీవల నిర్ణయించడంపై హర్షం వెలిబుచ్చారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక ఏకీకరణపైనా వారు కీలకంగా దృష్టి సారించారు. మరోవైపు భారత్‌లో శాశ్వత శాఖ ఏర్పాటుకు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (DFC) నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామం. భారత్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా 600 మిలియన్ డాలర్లతో ఈ శాఖ ఏర్పాటు కానుండటం విశేషం. అంతేకాకుండా అంతర్జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా బహుళ-భాగస్వామ్యంగల ‘బ్లూ డాట్‌ నెట్‌వర్క్‌’ ప్రతిపాదనపై అధ్యక్షుడు ట్రంప్‌, ప్రధానమంత్రి మోదీ ఆసక్తి వ్యక్తంచేశారు.

జాతీయ భద్రతలోనూ సహకార పునరుద్ధరణకు వారు నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు దేశాల చట్ట సంస్థల సమన్వయంతో కొత్తగా మాదకద్రవ్య నిరోధక కార్యాచరణ బృందం ఏర్పాటైంది. అలాగే వాణిజ్యంలో చిక్కుముడుల తొలగింపు దిశగానూ ముందడుగు పడింది. ఆ మేరకు పరిమిత ఒప్పందంపై ప్రస్తుతం కొనసాగుతున్న సంప్రదింపులు త్వరగా పూర్తిచేసేందుకు ఉభయపక్షాలూ నిర్ణయించాయి. ఆ తర్వాత రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల పూర్తి సామర్థ్యానికి తగినట్లు సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో భారత-అమెరికాల మధ్య ఇంధన సహకారం కూడా విస్తృతమవుతోంది. ఆ మేరకు అమెరికా నుంచి భారత్‌కు చమురు, సహజవాయు దిగుమతులతోపాటు అమెరికా పెట్రోలియం పరిశ్రమల్లో భారత్‌ పెట్టుబడులు కూడా పెరిగాయి. భవిష్యత్తులో ఇవి మరింత విస్తృతం కాగల అవకాశాలు మెండుగా ఉన్నాయి. ట్రంప్‌ ప్రస్తుత పర్యటన నేపథ్యంలో అంతరిక్షం, విద్య, ఆరోగ్య రంగాల్లోనూ సహకారానికి ఉత్తేజం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇక పునర్వ్యవస్థీకృత ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం, అణు సరఫరా కూటమి (NSG)లో స్థానం కల్పించడంపై అమెరికా మద్దతును అధ్యక్షుడు ట్రంప్‌ పునరుద్ఘాటించారు. మొత్తంమీద అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన ఫలవంతంగా, చిరస్మరణీయంగా సాగిందని చెప్పవచ్చు!





రచన: దౌత్యవేత్త నవ్‌తేజ్‌ సర్ణా, అమెరికాలో భారత మాజీ రాయబారి

Comments