అధ్యక్షుడు ట్రంప్‌ తొలి భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌లో పాదం మోపడంద్వారా తన తొలి భారత పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. దేశాధినేతలిద్దరి మధ్యగల వ్యక్తిగత సాన్నిహిత్యానికి ఈ స్వాగత సత్కారం అద్దంపట్టింది. అనంతరం మహాత్ముని జన్మభూమి గుజరాత్‌లో ఆ మహనీయుడు నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్‌ సందర్శించారు. బ్రిటిష్‌ పాలన నుంచి భారత దాస్యవిముక్తిలో జాతిపిత పోషించిన పాత్ర దృష్ట్యా ట్రంప్‌ సందర్శనకు ప్రాముఖ్యం ఏర్పడింది. అహ్మదాబాద్‌లోని మొతేరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంను ప్రారంభించాలని కోరడంద్వారా ట్రంప్‌ను భారత్‌ సాదరంగా స్వాగతించింది. అందునా దేశం నలుమూలల నుంచి హాజరైన లక్షకుపైగా జనసమూహం సమక్షంలో ఆయనకు ఈ అరుదైన గౌరవం లభించింది. అటుపైన దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంగీత-నృత్య నైపుణ్యంతో కొన్ని గంటలపాటు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అమెరికా అధ్యక్షుడికి చవిచూపారు.

భారతీయతలోని వైవిధ్యం, భారతీయ సమాజంలోని బహుళ సంస్కృతీ సౌందర్యాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ తిలకించి పులకించారు. అనంతరం మొతేరా స్టేడియంలో ఆయన ప్రసంగం లక్షలాది భారతీయులకు వీనులవిందు చేసింది. ఇప్పటిదాకా రేడియో లేదా టెలివిజన్‌లో ట్రంప్‌ గళం విన్న ప్రజలు, నేరుగా ఆయన ఉపన్యాసం విని ఆనందభరితులయ్యారు. ముఖ్యంగా ఏడు దశాబ్దాల స్వల్ప వ్యవధిలో భారత ప్రగతి కథనాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసాపూర్వకంగా వివరించారు. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, శాస్త్ర-సాంకేతిక ప్రగతి వగైరాలను విపులీకరించారు. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ రూపొందిందని చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి రీత్యా ప్రపంచంలో ఐదో స్థానంలోగల బ్రిటన్‌ను పక్కకు నెట్టి అతిపెద్ద ఆర్థికశక్తిగా ఆవిర్భవించిందని కొనియాడారు. ఇక అమెరికా సమాజ ప్రగతి కోసం 40 లక్షల మందికిపైగా భారత-అమెరికన్లు అవిరళ కృషి చేశారంటూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో అద్భుత పురోగతిని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యేకంగా వివరించారు. ఈ బంధం ఇంకా పటిష్ఠమై నిత్యనూతనంగా కొనసాగడం తథ్యమన్నారు. ఉగ్రవాద పీడ నిర్మూలనలో భారత-అమెరికాల సమన్వయ కృషి అవసరాన్ని నొక్కిచెబుతూ- పశ్చిమాసియాలో ‘ఐసిస్‌’ అగ్రనేతల అంతంతోపాటు సదరు ఉగ్రవాద సంస్థ ఉనికి అదృశ్యం కావడాన్ని ట్రంప్‌ ఉటంకించారు. పాకిస్థాన్‌పై ఒత్తిడి దిశగా ప్రయత్నాలను వివరిస్తూనే- పాక్‌ తమ మిత్రదేశమని పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ విషయమై ట్రంప్‌ ప్రస్తావన చాలామందికి అనవసరం అనిపించి ఉండొచ్చు. కానీ, ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధానికి స్వస్తి దిశగా ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో పాక్‌ గురించి ఆయన వ్యాఖ్యలు అమెరికా దృష్టిలో ఒక అవసరంగా భావించవచ్చు. అయితే, తన వ్యాఖ్యలను సమతూకం చేసుకుంటూ- ఉగ్రవాద నిరోధంలో భారత-అమెరికాలకుగల పాత్రను ఆయన నొక్కిచెప్పారు. ఉగ్రవాదానికి నిధులందిస్తున్న దేశాల జాబితాలో పాకిస్థాన్‌ కొనసాగింపును భారత్‌, అమెరికాలతోపాటు చివరకు చైనా కూడా ఇటీవల సమర్థించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. అంతేకాకుండా పాకిస్థాన్‌పై ట్రంప్‌ యంత్రాంగం కొన్ని ఆంక్షలు విధించడంసహా లోగడ మంజూరు చేసిన నిధులను కూడా ఉపసంహరించింది. అమెరికా తీసుకున్న ఇలాంటి చర్యల నేపథ్యంలో పాకిస్థాన్‌పై ట్రంప్‌ ప్రకటన అర్థం చేసుకోదగినదే. మరోవైపు భారత్‌-అమెరికాల మధ్య రక్షణ, భద్రత రంగాల్లో సహకార విస్తృతికిగల ప్రాముఖ్యాన్ని ప్రస్ఫుటం చేయడానికి వెనుకాడలేదు. ఆ మేరకు ద్వైపాక్షిక సైనిక విన్యాసాల ఆధునికీకరణ, భారత్‌కు అత్యధునాతన ఆయుధ సామగ్రి విక్రయం గురించి ప్రముఖంగా ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడి ప్రప్రథమ పర్యటనలో తొలిదశ సాదృశమానం, సంకేతప్రాయం కాగలదన్న భావన ద్యోతకమైనా, వాస్తవంలో- సారాంశసహితంగా రూపొందింది. ఆ మేరకు తన ప్రసంగ ఆద్యంతం భారత-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ప్రయోజనాత్మకత, గంభీరత, ప్రాముఖ్యాలను భారత ప్రజానీకానికి ట్రంప్‌ సుస్పష్టంగా వివరించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణలో భాగంగా మరో భారీ ఒడంబడికకు అవకాశం ఉందన్న సంకేతాలిచ్చారు. సోవియట్‌ యూనియన్‌ పతనం, ప్రచ్ఛన్నయుద్ధ సమాప్తి తర్వాత అంతర్జాతీయ క్రమం మారుతోంది. తదనుగుణ కీలక పరిణామాల్లో భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వికాసం కూడా ఒకటన్నది తిరుగులేని వాస్తవం. ఈ భాగస్వామ్యం ఊర్ధ్వముఖంగా సాగుతున్నప్పటికీ ఎగుడుదిగుళ్లు, సవాళ్లు కూడా లేకపోలేదు. ఆ మేరకు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రత్యేకించి వాణిజ్య-వ్యాపార వ్యవహారాల్లో కొత్త సవాళ్లు, చిక్కుముడులు పడ్డాయి. అయితే, రెండు దేశాల ఉన్నతాధికారుల చొరవతో రాజీ సుగమమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ఒప్పందం ఖరారు కాగలదన్న అంచనాలు వెలువడ్డాయి. కానీ, రెండు ప్రభుత్వాలకూ మరికొంత సమయం అవసరం కాబట్టి, కొత్త ఒడంబడిక త్వరలోనే రూపుదిద్దుకోగలదని ఆశిద్దాం!

రచన: ప్రొఫెసర్‌ చింతామణి మహాపాత్ర, రెక్టార్‌-ప్రొ వీసీ, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం

Comments