ద్వైపాక్షిక సంబంధాలను నూతన తీరాలకు తీసుకుపోనున్న భారత్, నేపాల్

ఇటీవల భారత్, నేపాల్ జాయింట్ కమిషన్ 5వ సమావేశం ఖట్మాండులో జరిగింది. సందర్భంగా ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన అంశాలపై దృష్టి సారించాలని నిర్ణయించాయి. ఇరు దేశాల్లోని ప్రాంతాల అనుసంధానం, ఆర్థిక భాగస్వామ్యం, వాణిజ్యం, రవాణ, విద్యుత్, నీటి వనరులు, సంస్కృతిక రంగం, విద్యా రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ సమావేశానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు అధ్యక్షత వహించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి డా. సుబ్రమణ్యం జైశంకర్ ఢాకా నుంచి ఖాట్మాండుకు బయలుదేరి వెళ్లారు. ఢాకాలో పరస్పర ప్రయోజనాలు, ప్రాంతీయ అంశాలపై అక్కడి నేతలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఖాట్మాండుకు వెళ్లారు.

జాయింట్ కమిషన్ సమావేశానికి ముందు డా. జైశంకర్ నేపాల ప్రధాని కె.పి.శర్మ ఓలిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది మే నెలలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండవ సారి తిరిగి ఎన్నికైన తర్వాత నేపాల్‌కు ఒక ఉన్నత స్థాయి పర్యటన జరగడం ఇదే తొలిసారి. నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి జాయింట్ కమిషన్ సమావేశం జరగడం సంతోషంగా ఉందనీ, భారత్-నేపాల్‌ల మంధ్య సంబంధాలను ఇది బలోపేతం చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాక ఈ దిశలో గత రెండేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలను కూడా ఆయన గుర్తు చేశారు. నేపాల్ ప్రధాని ఓలి గత ఏడాది ఏప్రిల్ మాసంలో భారత్ పర్యటనకు వచ్చారు. అంతకుముందు 2018 మే, ఆగస్టు మాసాల్లో ప్రధాని మోదీ రెండు సార్లు నేపాల్‌లో పర్యటించారు. 

భారత్ సహాయంతో పూర్తయిన మోతిహారీ-అమ్లేఖ్‌కుంజ్ పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్ ప్రాజెక్టు, నువకోట్, గోరఖ్ జిల్లాల్లో భూకంపం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నిర్మించిన ప్రైవేటు ళ్ల నిర్మాణాల పట్ల జాయింట్ కమిషన్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ రెండు పనులు సకాలంలో పూర్తయినందుకు సంతృప్తి వ్యక్తపరిచింది. నేపాల్‌లో హౌజింగ్ ప్రాజెక్టుల కోసం భారత దేశం 2.45 బిలియన్ నేపాలీ రూపాయల చెక్కును భారత్ అందజేసింది. ఇరువురు మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నేపాల్‌లోని తెరాయ్ ప్రాంతంలో రోడ్డు అభివృద్ధి పనుల కోసం గాను భారత్ మరో 80.71 కోట్ల భారత కరెన్సీ చెక్కును కూడా అందజేసింది. ఈ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం 500 కోట్లు సహాయాన్ని అందజేసేందుకు సంసిద్ధత ప్రకటించింది. తెరాయ్ ప్రాంతంలో ఇప్పటికే నాలుగు సెగ్మెంట్ల ‘హులకీ’ రోడ్లను ప్రారంభించింది. 

ఇరువురు మంత్రుల సమక్షంలో ఆహార భద్రత, నాణ్యతకు సంబంధించి ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. నేపాల్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్, భారత్‌కు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీల మధ్య కుదిరిన ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. 


సమావేశానికి అధ్యక్షత వహించిన భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జైశంకర్, నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి ప్రదీప్ గ్యావాలీలు ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న పలు ప్రాజెక్టుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జయనగర్-జనక్‌పూర్, జోగ్బానీ-బిరాట్‌నగర్ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, బిరాట్ నగర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు పనుల విషయంలో ఇరు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. నేపాల్ ప్రధాని భారత్ పర్యటనకు వచ్చినపుడు మూడు కొత్త అంశాల్లో కుదిరిన ఒప్పందాల ప్రగతిని కూడా ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు సమీక్షించారు. రాక్సుల్-ఖాట్మండు ఎలక్ట్రిఫైడ్ రైల్ లైన్, అంతర్గత జల మార్గాలు, వ్యవసాయ రంగంలో భాగస్వామ్యం అనే మూడు అంశాల ప్రగతిని సమీక్షించారు. రాక్సుల్-ఖాట్మండు రైల్ లింక్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై భారత్, నేపాల్ దేశాల జాయింట్ టీమ్‌లు అధ్యయనాన్ని ముగించాయి. అంతర్గత జలమార్గాల విషయంలో కూడా సంయుక్త అధ్యయనం ముగిసింది. నేపాల్‌లోని నారాయని, కోసీ నదుల మధ్య ఒక మోస్తరు నావలు తిరిగేందుకు గల అవకాశాలను అధ్యయనం చేశారు. 


1950ల నాటి భారత్-నేపాల్‌ల నడుమ కుదిరిన శాంతి, సౌభాతృత్వ అవగాహనపై ఇరు దేశాల మంత్రులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరు దేశాల ప్రధానులకు నేపాల్-భారత్‌ల నడుమ సంబంధాలకు సంబంధించి ప్రముఖ వ్యక్తుల బృందం రూపొందించిన నివేదికను సమర్పించాలని నిర్ణయించారు. ఇరు పక్షాల వైపు వ్యాపార, వాణిజ్య, రవాణా రంగంలో ఉన్న ఒప్పందాలను, అవగాహనలను సమీక్షించాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతుల నిర్వహణను మెరుగుపర్చాలనీ, మెరుగైన వసతులు కల్పించాలని కూడా నిర్ణయించారు. 


నేపాల్, భారత్ సరిహద్దుల్లోని వరద ముంపు పరిస్థితిపై సీరియస్‌గా దృష్టి సారించాలనీ, నష్ట నివారణా చర్యలు చేపట్టేందుకు ఇరు దేశాల అధికారుల బృందం తమ పరిశీలనలో తేల్చిన అంశాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. 


భారత్, నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశం దాదాపు మూడు సంవత్సరాల గడువు అనంతరం తిరిగి చోటుచేసుకుంది. గతంలో 2016లో అక్టోబర్‌లో న్యూఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించారు. ఇరు దేశాలు 1987లో జాయింట్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సహకారం అనే అంశాలపై పరస్పర అవగాహన కోసం దీన్ని ఏర్పాటు చేశారు. కాగా చాలా కాలంగా ఇరు నిస్తేజంగానే ఉండిపోయింది. 


తన ఖాట్మండు పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి న్యూఢిల్లీకి తిరుగు పయనమయ్యే ముందు నేపాల్ రాష్ట్రపతి విద్యా దేవీ భండారీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషన్ కారణంగా భారత్, నేపాల్‌ల సంబంధాలు నూతన తీరాలకు చేరుతాయనే ఆశాభావం వ్యక్తమయింది.



రచన : రతన్ సల్దీ, రాజకీయ వ్యాఖ్యాత

Comments